మంచిర్యాల, జనవరి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్ టికెటు.. కార్పొరేటర్ టికెట్ కావాలంటే పైసలిచ్చుకోవాల్సిందేనంటూ సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలే ఆవేదన వ్యక్తం చేయడం జిల్లాలో చర్చనీయాంశమవుతున్నది. మొన్నటికి మొన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలోనే పైసలిచ్చినోళ్లకే టికెట్లు ఇస్తున్నారంటూ ఓ నాయకుడు నిలదీశాడు. ముందు నుంచి పార్టీలో ఉన్న కార్యకర్తలను కాదని, మధ్యలో చేరిన వారికి కౌన్సిలర్ టికెట్లు అమ్ముకుంటున్నారంటూ కాంగ్రెస్ లీడర్లు గొడవకు దిగారు. జిల్లా స్థాయిలో ఇన్చార్జి పదవిలో ఉన్న లీడర్ ఈ సందర్భంగా ఓ దళిత నాయకుడిని నెట్టివేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
కాగా, తాజాగా మంచిర్యాల జిల్లా నుంచి ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న ఓ ముఖ్యనాయకుడికి ఈ విషయంపై కొందరు కార్యకర్తలు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇలాంటివి జరగకుండా అడ్డుకోవాల్సిన ఆయనే.. తప్పు ఏముంది పార్టీ కార్యక్రమాల కోసం ఖర్చు పెడుతున్నారు కదా.. డబ్బులు అలాగే వసూలు చేస్తారంటూ దబాయించారనే చర్చ జరుగుతున్నది. దీంతో ఫిర్యాదు చేసిన నాయకులు తెల్లబోయి.. ఈ విషయాన్ని బయట విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఒక్క ఆ నియోజకవర్గంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా దాదాపు ఇదే పరిస్థితి ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఓ నియోజకవర్గంలో రూ.3 లక్షలు ఇచ్చిన వారికే టికెట్ అంటూ కౌన్సిలర్ బేరం పెట్టారనే చర్చ సాగుతున్నది.
మంచిర్యాల జిల్లాలో అధికార పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. మొన్నటికి మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన స్థాయి ఫలితాలు రాలేదు. కీలక నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో అధికార పార్టీకి సమానంగా బీఆర్ఎస్, స్వతంత్య్ర అభ్యర్థులు గెలుపొందారు. స్వయంగా ఆయన ప్రచారం చేసిన గ్రామాల్లోనూ కాంగ్రెస్ గెలవలేకపోయింది. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోతే రాష్ట్రవ్యాప్తంగా మరోసారి పరువుపోగొట్టుకోక తప్పదు. దీంతో ఈ ఎన్నికలు ఆయన కు ప్రతిష్టాత్మకంగా మారాయి. మొన్నీమధ్యే నియోజకవర్గ కేంద్రానికి చెందిన సీరియర్ నాయకుడు పార్టీకి రాజీనామా చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని, అత్యధిక స్థానాల్లో గెలిచి ప్రభుత్వంలో ఆ ముఖ్యనేతను దెబ్బగొట్టాలని తహతహలాడుతున్నారు. ఇక ఆ నియోజకవర్గంలో ఉన్న మరో మున్సిపాలిటీలోనూ అధికార పార్టీకి అనుకూల పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో ఈ ఎన్నికలు ఆయనకు ఇజ్జతికే సవాల్‌గా మారాయి. మరోవైపు ప్రభుత్వం పదవి ఆశించి భంగపడిన ఎమ్మెల్యే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్నారు. ఈ ఎన్నికలను అత్యంత ప్రతిస్టాత్మకంగా తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి గట్టిపోటీ ఉన్న నేపథ్యంలో అవసరమైతే బెదిరించడానికి కూడా ఆయన వెనుకాడటం లేదని తెలిసింది. దీంతో ఆ నాయకుడి తీరుపై జనాల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతున్నది.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్‌లో కష్టపడ్డ లీడర్లకు మొండిచేయి తప్పేలా లేదు. ఇన్ని రోజులు జెండా మో సి తిరిగిన నాయకులు ఖర్చు పెట్టుకోలేని స్థోమత లేకపోతే పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. దీంతో చాలా మంది ఆశావాహులు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కువ మంది నుంచి పోటీ ఉన్న వార్డుల్లో పార్టీ నుంచి టికెట్లు దక్కించుకునేందుకు కొందరు భూములు, ఇండ్లు అమ్ముకునేందుకు సిద్ధమవుతున్నారు. కాగా, పాత మంచిర్యాల నుంచి అధికార పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ నా యకుడికి కాదని సాదాసీదా వ్యక్తిని రంగంలోకి దింపేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.
ఈ దెబ్బతో ఆ లీడర్‌కు చెక్‌పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇసుక అక్రమ రవాణా, విద్యుత్ కాంట్రాక్ట్‌లు, భూ కబ్జాలతో కోట్లకు ఎదిగిన సదరు యువనేతను పోటీ తప్పించాలనే కృతనిశ్చయం తో పావులు కదుపుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నా యి. ఇది మంచిర్యాలలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిం ది. దీంతో పార్టీనే నమ్ముకొని కష్టపడిన నాయకులు, కార్యకర్తలు తమకు అవకాశం వస్తుందో రాదో అన్న సందేహం తో కొట్టుమిట్టాడుతున్నారు. అదే జరిగితే పార్టీని విడి ఇతర పార్టీల నుంచి లేదా రెబల్స్‌గా పోటీ చేయాలని భావిస్తున్నారు. అదే జరిగితే అధికార పార్టీకి ఈ ఎన్నికల్లో రెబల్స్ బెడద ఎక్కువ అవ్వొచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.