ఎదులాపురం, మార్చి 11 : నిత్యం తాటి బెల్లం ఆహారంలో భాగంగా తీసుకుంటే అమృతంగా పనిచేస్తుంది. సర్వరోగాలను నివారిస్తుందని పలువురు ఆరోగ్యనిపుణులు పేర్కొంటున్నారు. తాటిబెల్లం తింటే ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యంగా అజీర్తితో పాటు క్యాన్సర్ కారకాలను శరీరం నుంచి బయటకు పంపించడంలో ఈ నల్లబెల్లం దోహదపడుతుంది. పేగులో పేరుకుపోయిన పలు రోగ కారకాలను తొలగిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో రోజూ భోజనం అనంతరం తాటి బెల్లం ముక్క తింటారు. కరోనా కల్లోలం తర్వాత ప్రతి ఒక్కరూ వారి ఆరోగ్యంపై ప్రత్యేకశ్రద్ధ చూపడం మొదలుపెట్టారు. కరోనా లాంటి వైరస్ల బారిన పడకుండా పోరాడాలంటే తప్పనిసరిగా రోగనిరోధక శక్తి అధికంగా ఉండాలని వైద్యునిపుణులు చెబుతూనే ఉన్నారు.
అందువల్ల చాలా మంది పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో పూర్తిగా రసాయనాలతో పండించిన పంటను పక్కనబెట్టి ఆర్గానిక్ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రసుత్తం వాడుతున్న చక్కెరకు ప్రత్యామ్నాయం తాటిబెల్లమేనని నిపుణులు చెబుతున్నారు. ఇందులో అవసరమైన ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. చక్కెరకంటే 60 రెట్లు ఎక్కువ ఖనిజాలను ఈ తాటిబెల్లం కలిగి ఉందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో ఖనిజాలతో పాటు అనేక విటమిన్లు ఇమిడి ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని బస్డాండ్, రిమ్స్ ఎదుట, రైల్వేస్టేషన్‌తో పాటు రద్దీ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసుకొని వ్యాపారులు ఈ తాటి బెల్లాన్ని విక్రయిస్తున్నారు.
పేగులను శుభ్రపర్చడంలో కీలకం..
తాటిబెల్లం పేగులను శుభ్రపర్చడానికి దోహదపడుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్స్థాయిని పెంచుతుంది. ఆస్తమాను తగ్గిస్తుంది. మరోవైపు ఇందులో ఉన్న మెగ్నీషియం నాడీ వ్యవస్థను నియంత్రిస్తుంది. ఇందులో ఎముకలకు బలాన్నిచ్చే కాల్షియం, పొటాషియం, భాస్వరం పుష్కలంగా ఉంటాయి. మహిళల్లో బహిష్టు సమస్యలను అరికడుతుంది. తాటిబెల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తం శుద్ధి చేసి శరీరంలో దెబ్బతిన్న కణజాలాన్ని పునరుద్ధరిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో వేడిని తొలగిస్తుంది. తాటి బెల్లంలో ఎక్కువగా శక్తి కలిగి ఉంటుంది. నీరసాన్ని తగ్గిస్తుంది. శరీరానికి ఎక్కువ శక్తిని అందిస్తుంది. ఫైబర్లు ఎక్కువగా ఉంటాయి. ఈ ఫైబర్స్ మలబద్ధకం, అజీర్తి చికిత్సకు సహాయపడతాయి. శరీరంలో హాని కారక టాక్సిన్లను బయటకు పంపిస్తుంది. నిత్యం తాటిబెల్లం తీసుకోవడం వల్ల శరీర పుష్టి, వీర్యవృద్ధి కలుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
పేగు కాన్సర్ నివారణలో..
తాటిబెల్లం తినడం వల్ల శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటికి పంపిస్తుంది. ఇది శ్వాసకోశ, పేగులు, ఆహారగొట్టం, ఊపిరితిత్తులు, చి న్నపేగు, పెద్దపేగులో ఉండే విషపదార్థాలను బ యటికి పంపించి పేగు క్యాన్సర్ రాకుండా చే స్తుంది. వాస్తవానికి పొడి దగ్గు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారు ఉదయాన్నే తాటిబెల్లం తింటే మంచి ఫలితం ఉంటుంది. గోరు వెచ్చని నీటిలో తాటిబెల్లం కలుపుకొని తాగితే జలుబు, దగ్గు నివారణలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మైగ్రేన్ తలనొప్పి ని తగ్గిస్తుంది. అధిక బరువును తగ్గించడంలో, బీపీని కంట్రోల్ చేయడంలో ఉపకరిస్తుంది. ముఖ్యంగా లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుం ది. తాటిబెల్లం తినడం వల్ల ఇన్ని ఉపయోగాలుండగా, నిత్యం ఆహారంలో భాగంగా తీసుకుంటే మేలని పలువురు సూచిస్తున్నారు.