టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై ఉద్యోగులు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం సంబురాలు నిర్వహించారు. పటాకులు కాల్చి.. మిఠాయిలు పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, హరీశ్‌రావు, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి చిత్రపటా లకు పాలాభిషేకాలు చేసి.. నినాదాలతో హోరెత్తించారు. ముఖ్యమంత్రి చేసిన మేలును ఎన్నటికీ మరచిపోలేమని, జీవితాంతం రుణపడి ఉంటామని స్పష్టం చేశారు. ఆయాచోట్ల ఎమ్మెల్యేలు జోగు రామన్న, దివాకర్‌రావు, జడ్పీ చైర్మన్లు పాల్గొన్నారు.
– ఆదిలాబాద్, ఆగస్టు 1(నమస్తే తెలంగాణ)
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తూ రాష్ట్ర మంత్రి వర్గం తీసుకు న్న నిర్ణయం తో ఆర్టీసీ ఉద్యోగుల చిరకాల వాంఛ నెరవేరింది. సంస్థ విషయంలో కేబినెట్ తీసుకున్న నిర్ణయం ఊహించనిది. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కీలకపాత్ర పోషించారు. మమ్ముల్ని ప్రభుత్వ ఉద్యో గులుగా గుర్తించడంతో పలు రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. మా ఆకాంక్షను నెరవేర్చిన ప్రభుత్వానికి అండ గా నిలుస్తాం. కష్టపడి పనిచేసి ప్రయాణి కులకు మంచి సేవలు అందిస్తాం.
– చిట్యాల సురేశ్, కండక్టర్, ఆదిలాబాద్ డిపో
ఆదిలాబాద్, ఆగస్టు 1(నమస్తే తెలంగాణ): టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని హర్షిస్తూ ఆదిలాబాద్ డిపోలో ఆర్టీసీ ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు. ఆదిలాబాద్, ఉట్నూర్ డిపోల్లో ఉద్యోగులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పటాకులు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఆదిలాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగు రామన్న, ఉట్నూర్‌లో జరిగిన సంబురాల్లో జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పాల్గొన్నారు. జిల్లాలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో 589 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. ఆదిలాబాద్ డిపోలో 461 మంది ఉద్యోగులు, ఉట్నూర్ డిపోలో 128 మంది పని చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో ఉద్యమాలు చేసిన తెలంగాణ సాధించారని, పది సంవత్సారాల సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో అభివృద్ధి జరిగిందని ఉద్యోగ సంఘాల నాయకులు అన్నారు. ముఖ్యమంత్రి అమలు చేస్తున్న పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాలు చేస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్న తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం సంతోషకరమైన విషయం అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులకు అండగా నిలుస్తున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్‌లో జరిగిన సంబురాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన సకల జనుల సమ్మెలో ఉద్యోగులు కీలకపాత్ర పోషించారని వారి ఆకాంక్షల మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం హర్షనీయమన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలుస్తున్నారని, సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడంతో ఉద్యోగులకు పలు రకాల ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు. ఉద్యోగులు కష్టపడి పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎం సోలేమాన్, డీఎం కల్పన, టీఎంయూ డిపో సెక్రటరీ కిషన్, నాయకులు రమేశ్, విలాస్, ఎస్బీ రావు, వెంకటయ్య, హుసేన్‌లు పాల్గొన్నారు.
నిర్మల్ అర్బన్, ఆగస్టు 1 : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని తెలంగాణ మజ్దూర్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు మారుగొండ రాము అన్నారు. మంగళవారం నిర్మల్ బస్ డిపో ఎదుట కార్మికుల సంఘాల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్‌రావు, ఐకే రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాలు ఆర్టీసీని నిర్వీర్యం చేశాయని, దీంతో సంస్థ నష్టాల ఊబిలోకి కూరుకుపోయిందని పేర్కొన్నారు. కార్మికుల కష్టాలు, సంస్థ నష్టాలను దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ ఆర్టీసీకి ప్రత్యేక నిధులు కేటాయించి ఆదుకున్నారని గుర్తు చేశారు. నిన్నటి వరకు కార్మికులుగా ఉన్న ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారని అన్నారు. ఈ కార్యక్రమంలో డిపో సెక్రటరీ గంగాధర్, మహేందర్‌రెడ్డి, హన్మంతు, మల్లేశ్, రవి, ఎండీ ఖాన్, కైలాస్ పతి పాల్గొన్నారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రకటించిన నేపథ్యంలో నిర్మల్ డిపో మేనేజర్ సాయన్న సీఎం కేసీఆర్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి చిత్రపటాలకు మంగళవారం డిపో కార్యాలయం ఆవరణలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయంతో కార్మికులు, సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు దక్కనుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ రాజశేఖర్, శ్రీకర్ పాల్గొన్నారు.
భైంసా, ఆగస్టు 1 : ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండాయని ఆర్టీసీ డీఎం అమృత అన్నారు. మంగళవారం భైంసా పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం పలువురు కార్మికులు కూడా సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
గర్మిళ్ల, ఆగస్టు 1 : తెలంగాణలోని కార్మికుల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. మంగళవారం మంచిర్యాల ఆర్టీసీ డిపోలో ఉద్యోగులు, కార్మికులతో కలిసి కేక్ కట్‌చేసి, సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంతకాలం ఆర్టీసీ కార్మికులు చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడ్డారని, సర్కారు నిర్ణయం వల్ల సుమారు 43 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారని తెలిపారు. అనంతరం పటాకులు కాల్చి సంబురాలు చేశారు. కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, యువ నాయకులు విజిత్‌కుమార్, కౌన్సిలర్ నల్ల శంకర్, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్, సాగర్ యాదవ్ పాల్గొన్నారు.
చెన్నూర్, ఆగస్టు 1 : ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తూ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఈ మేరకు చెన్నూర్ బస్టాండ్‌లో మంగళవారం సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెల దామోదర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ రత్న సమ్మిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నవాజొద్దీన్, కౌన్సిలర్లు దోమకొండ అనిల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మానికరౌతు శంకర్, బీఆర్ఎస్ నాయకులు మేడు సురేశ్‌రెడ్డి, వేముల మహేందర్, అయిత సురేశ్‌రెడ్డి, వీరమల్ల రాము, రాసపాక శ్రీశైలం, రాజశేఖర్, ముత్యాల సత్యవతి, బస్టాండ్ కంట్రోలర్ కిషన్, ఆర్టీసీ కార్మికులు సాదిక్, మల్లేశ్, శంకర్ పాల్గొన్నారు.
రెబ్బెన, ఆగస్టు 1 : రెబ్బెన మండల కేంద్రంలోని స్థానిక అతిథిగృహం ఆవరణలో మంగళవారం ఆర్టీసీ ఉద్యోగుల ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మిఠాయిలు పంపిణీ చేశారు. రెబ్బెన సర్పంచ్ బొమ్మినేని అహల్యాదేవి, ఎంపీటీసీ పెసరి మధునయ్య, కోఆప్షన్ మెంబర్ జౌరొద్దీన్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు మోడెం సుదర్శన్‌గౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యురాలు కుందారపు శంకరమ్మ, ఏఐటీయుసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్, బీఆర్ఎస్ మహిళా మండలాధ్యక్షురాలు అన్నపూర్ణ అరుణ, బీఆర్ఎస్ నాయకులు బోమ్మినేని శ్రీధర్, జుమ్మిడి ఆనందరావు, దుర్గం రాజేశ్, సర్వేశ్వర్గౌడ్, ఆర్టీసీ ఉద్యోగులు అన్నపూర్ణ మురళీగౌడ్, ముంజల సుదర్శన్‌గౌడ్, ఎండీ తాహెర్, నానాజీ, మోహన్, గణపతి, బుర్స భీమయ్య, రాజలింగు, లక్ష్మణ్ ఉన్నారు.
కాగజ్‌నగర్, ఆగస్టు 1 : కాగజ్‌నగర్ పట్టణంలోని ప్రయాణ ప్రాంగణ ఆవరణలో మంగళవారం ఆర్టీసీ కార్మికులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వాలు తమను పట్టించుకోలేదని, తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినందుకు ఆనందంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు ఖలీల్ పాషా, లక్ష్మణ్, కవిత, భాగ్యలక్ష్మి, తాజ్, సంధ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.