కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో మరో వారం.. పదిరోజుల్లో యాసంగి వరి కోతలు ప్రారంభించే అవకాశముండగా, సర్కారు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం ఆందోళనకు గురి చేస్తున్నది. మొత్తంగా 18 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా, సుమారు 20 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని యంత్రాంగం అంచనా వేస్తున్నది. ఆ మేరకు సీఏసీఎస్, ఐకేపీ, డీసీఎంఎస్ కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరించాల్సి ఉండ గా, ఇంత వరకూ ఎలాంటి కార్యాచరణ రూపొందించకపోవడంపై రైతాంగం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది.
తగ్గిన వరి సాగు
జిల్లాలో యాసంగి వరి కోతలకు రైతాంగం సన్నద్ధమవుతున్నది. గతేడాది యాసంగిలో 30 వేల ఎకరాల్లో వరి సాగు కాగా, ఈ యేడాది 18 వేల ఎకరాల్లో మాత్రమే వేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దిగుబడి కూడా తగ్గే అవకాశమున్నది. గత వానకాలంలో వడ్లకు క్వింటాలుకు రూ. 2350 మద్దతు ధర ప్రకటించగా, ఈ యేడాది ఏ-గ్రేడ్‌కు రూ. 2389, బీ-గ్రేడ్‌కు రూ. 2389 మద్దతు ధర నిర్ణయించారు.
కరెంట్ కోతలతో దిగుబడిపై ప్రభావం
జిల్లాలో అత్యధికంగా బోర్లమీదే ఆధారపడి యాసంగి పంటలు సాగు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు కోతలు విధించడం వల్ల వరికి కావాల్సిన సమయాల్లో నీరందించేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీని ప్రభావం ధాన్యం దిగుబడిపై పడే అవకాశమున్నది. ఇక యాసంగి పంటలు కోసేనాటికి కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి వస్తాయో.. రావోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది ఏప్రిల్ మొదటి వారంలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించారు. కానీ, ఈ ఏడాది ఇంత వరకూ ధాన్యం కొనుగోళ్ల ఏర్పాట్ల గురించి అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోతే రైతులు మిల్లర్లు, దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి.
గతేడాది తీవ్ర ఇబ్బందులు
ధాన్యం కొనుగోళ్లకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించక తప్పేలా లేదు. గత వానకాలంలో ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సన్నబియ్యానికి రూ. 500 బోనస్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎంతమంది రైతులకు వేసిందో అధికారులకే తెలియని పరిస్థితి ఉన్నది. ఈ క్రమంలో ఈ యాసంగిలో ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా.. లేదా అనే సందేహం రైతుల్లో ఉన్నది. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.