మందమర్రి రూరల్/ కన్నె పల్లి/కోటపల్లి/ వేమనపల్లి/ నెన్నెల/దహెగాం, మే 17 : మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారు జాము వరకు కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిముద్దయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటిపాలు కాగా, రైతాంగం తీవ్రంగా నష్టపోయి కన్నీళ్లు పెట్టుకుంటున్నది. మందమర్రి మండలం సారంగపల్లి, పొన్నారం, బొక్కలగుట్ట వరిధాన్యం కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలు వెంటనే మిల్లులకు తరలించకపోవడంతో తడిసిపోయాయి. సారంగపల్లిలో మొలకెత్తిన వడ్లను చూసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కన్నెపల్లి మండలం మాడవెల్లి, కన్నెపల్లి, లింగాల, మెట్పల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో వర్షపు నీరు నిలిచి.. వడ్లు తడిశాయి. కోటపల్లి మండలం షట్పల్లి, పారుపల్లి, కొల్లూరు, ఆలుగామ, బొప్పారం, కోటపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం వరదలో నానిపోగా, రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కవర్లు కప్పినప్పటికీ వరద రావడంతో వడ్లు కొట్టుకుపోయాయి. గుంతల్లో నిలిచిన నీటిని కాలువలు పెట్టి తొలగింపజేశారు.
వేమనపల్లి మండలంలో శనివారం తెల్లవారుజామున వర్షం పడగా, కోతకు వచ్చిన వరి నేలకొరిగింది. ఇక పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. భారీ వర్షానికి నెన్నెల మండలంలోని గొల్లపల్లి, జోగాపూర్, మైలారం, ఘన్పూర్, నెన్నెల గ్రామాల్లో రెండు వందల ఎకరాలకు పైగా వరి నీటమునిగింది. దెబ్బతిన్న పంటను కోయలేక రైతులు పశువులకు విడిచి పెడుతున్నారు. ఇక కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలంలోని కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యంతో పాటు కల్లాల్లో ఆరబెట్టిన వడ్లు సైతం తడిసిపోయాయి. బ్యాగ్‌లతో పాటు టార్పాలిన్లు గాలికి కొట్టుకుపోయాయి. కొనుగోలు కేంద్రాల్లోకి ధాన్యం తెచ్చి నెల రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు చేపట్టం లేదని, సర్కారు నిర్లక్ష్యంతో తమ రెక్కల కష్టం నష్టపోవాల్సి వచ్చిందని, ఇందుకు బాధ్యత వహించి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నెన్నెల మండలం లంబాడీతండా ఎర్రవాగుపై తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కల్వర్టు కోతకు గురైంది. లంబాడీతండా, మన్నెగూడెం, కోణంపేట, జంగాల్‌పేట,కర్జి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఖర్జి ఇసుక రీచ్‌కు వెళ్లే దారి లేకపోవడంతో వందలాది ట్రాక్టర్లను నిలిపివేశారు. ఆన్లైన్ బుకింగ్‌ను బంద్ చేశారు. టెండర్ పూర్తయి మూడు నెలలు గడిచినా పనులు చేపట్టకపోవడంతో వర్షాలు పడ్డప్పుడల్లా ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది.