బాసర, జూన్ 20 : బాసర సరస్వతీ ఆలయ అభివృద్ధిని పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చూపు చూస్తున్నదని నిర్మల్ జిల్లాలోని ముథోల్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి నారాయణ్రావుపటేల్ అన్నారు. శుక్రవారం బాసర మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా బాసర, ముథోల్ మండలాల పార్టీ కార్యవర్గాలను నియమించారు. ముఖ్య అతిథులుగా నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ చంద్రశేఖర్‌గౌడ్, డీసీసీ అధ్యక్షుడు కుచాడి శ్రీహరిరావు, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముథోల్ నియోజక వర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే నారాయణ్రావుపటేల్ మాట్లాడారు. బాసర అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదన్నారు. ఆలయంలో సరిపడా సిబ్బంది లేరని, ఇన్చార్జి ఈవోతో ఆలయంలో అభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు. ఇంజినీరింగ్ వ్యవస్థ లేదని, ఇన్చార్జిల పాలన నడుస్తున్నదని, రెగ్యులర్ అధికారులను వెంటనే నియమించాలన్నారు. గత ప్రభుత్వంలో మంజూరైన రూ.50 కోట్లలో రూ.8 కోట్లు ఖర్చు చేసి మిగిలిన వాటిని మళ్లీ వెనక్కి తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొన్ని రోజులుగా వేములవాడకు భారీగా నిధులు కేటాయించి మాస్టర్ ప్లాన్ రెడీ చేసి అభివృద్ధి పరుస్తున్నారన్నారు. కానీ బాసర ఆలయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అనంతరం మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి మాట్లాడుతూ బాసర అభివృద్ధికి విడుదలైన నిధుల్లో వెనక్కి వెళ్లిన వాటిని నెల రోజుల్లో వచ్చేలా ప్రయత్నిస్తానన్నారు. అదే విధంగా బాసర మాస్టర్ ప్లాన్‌కు పీఠాధిపతుల అనుమతులు లభించాయని, నెల రోజుల్లో పూర్తి బాధ్యతలు గల ఈవోను బాసర ఆలయానికి నియమించేలా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బాసర అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు మంజూరు చేయగా అందులో నుంచి రూ.8 కోట్లు ఖర్చు చేశారు. కాంగ్రెస్ వచ్చాకా రూ.42 కోట్లను వెనక్కి తీసుకున్నది. వీటన్నింటిని తెలుసుకోకుండా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. బాసర అభివృద్ధికి విడుదలై వెనక్కి వెళ్లిన రూ.42 కోట్లను తీసుకువచ్చి క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని ఆశిస్తున్నాం.
– కోర్వ శ్యాం, బీఆర్ఎస్ బాసర మండల కన్వీనర్