కుభీర్ : మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కుభీర్ మండలంలో చెరువులు, కుంటలు, వాగులు, కాలువలు నిండి ( Over flowing streams ) ప్రవహిస్తున్నాయి. దీంతో మహారాష్ట్ర( Maharastra), తెలంగాణ ( Telangana ) సరిహద్దులోని బెల్గాం తండా వద్ద లో లెవెల్ వంతెన కోత గురి కావడంతో దాని పైనుండి వరద నీరు ప్రవహిస్తోంది. ఈ కారణంగా మహారాష్ట్ర, తెలంగాణకు రాకపోకలు నిలిచిపోయాయి. వరదల వల్ల రహదారులు జలమయమయ్యాయి.
మండలంలోని బెల్గాం తండా వద్ద గల బ్రిడ్జి పై నుంచి వర్షపు నీరు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. నిఘ్వా, గోడపూర్, మార్లగొండ, కుభీర్ నుంచి పార్డి బీ వెళ్లే రహదారిలో ఒర్రెలు, వాగులు నిండిపోయాయి. ఎంపీడీవో సాగర్ రెడ్డి, ఎంపీవో మోహన్ సింగ్, ఎస్సై కృష్ణారెడ్డి, తహసీల్దార్ శివరాజ్, అధికారుల బృందం బెల్గమ్ తండా వద్ద బ్రిడ్జిని సందర్శించి పరిశీలించి సూచికలు ఏర్పాటు చేశారు. అవతలి పక్క గ్రామాల ప్రజలకు బ్రిడ్జి పైనుంచి ఎవరు వెళ్లొద్దని సమాచారం అందించారు.
అన్ని గ్రామాల కార్యదర్శులకు అప్రమత్తంగా ఉండాలంటూ ఎంపీడీవో సాగర్ రెడ్డి ఎంపీవో మోహన్ సింగ్ అలర్ట్ చేశారు. పశువులను మేపేందుకు వెళ్లొద్దని, చేపలు పట్టేందుకు ఎవరు చెరువులు, వాగుల్లోకి వెళ్లవద్దని గ్రామాల్లో దండోరా వేయించాలని సూచించారు. వర్షాలు ఇంకా రెండు మూడు రోజులు కురుస్తున్నాయన్న వాతావరణ శాఖ సమాచారం మేరకు పంచాయతీ కార్యదర్శులు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ఆదేశించారు. గ్రామాల్లో పాత ఇల్లు కూలిపోయినా, విద్యుత్ ప్రమాదాలు ఏవైనా జరిగిన వెంటనే సమాచారం చేరవేయాలన్నారు.