ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. తండాలు, గూడేలు, పల్లెలు నీటిలో చిక్కుకున్నాయి. బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురుస్తుండడంతో బాసర వద్ద గోదారి ఉధృతంగా ప్రవహిస్తున్నది. పంట పొలాలు నీట మునిగాయి. వరి నాటు కుళ్లిపోతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బైక్‌పై వెళ్లి పంటలను పరిశీలించారు. రైతులకు నేనున్నా అంటూ ధైర్యం చెప్పారు. కాంగ్రెస్ సర్కారు పంట నష్టపోయిన రైతులకు రూ.25 వేల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాడు.
ఖానాపూర్, ఆగస్టు 19 : మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఖానాపూర్ పట్టణ శివారులోని గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువనకు నీటిని వదలడంతో గోదావరికి ఇరువైపులా వరద అనుకుని ప్రవహిస్తూ సందర్శకులను ఆకర్షిస్తున్నది. సందర్శకులు, పశువుల కాపారులు, మత్స్యకారులు, రైతులు నదీ పరీవాహక ప్రాంతానికి వెళ్లరాదని పోలీసులు, రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఉట్నూర్ రూరల్, ఆగస్టు 19 : అల్పపీడన ప్రభావంతో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు నిండుకుండలుగా మారాయి. మత్తడి ద్వారా నీరు దిగువనకు వెళ్తున్నది. వాగులలో వరద నీటి ప్రవాహం కొనసాగుతున్నది. మంగళవారం ఉదయం వరకు జోరువాన కురిసింది. దీంతో గంగన్నపేట్ గ్రామంలోని చెరువు ఆయకట్టు కింద ఉన్న పొలాలు నీట మునిగాయి. ఇప్పటికే ఐదు రోజుల నుంచి పొలాలు నీటిలో ఉన్నాయి. దీంతో వేసిన నాట్లు వరదకు కుళ్లిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం ఇలాగే కొనసాగితే పత్తి పంట కూడా దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
బేల, ఆగస్టు 19 : ఐదు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు శంకర్‌గూడ చెక్ పోస్టు వద్ద భారీ వాహనాలను పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. దీంతో మంగళవారం రెండు కిలో మీటర్ల మేర వందలాది వాహనాలు నిలిచిపోయాయి. ప్రధాన కారణం తర్నం వాగు ఉధృతంగా ప్రవహించడం వల్ల భారీ వాహనాలకు అనుమతి ఇవ్వడం లేదు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన లారీ డ్రైవర్లకు కష్టాలు తప్పడం లేదు. వర్షం తగ్గినా కొద్దీ అనుమతి ఇవ్వాలని వేడుకున్నారు.
ఇంద్రవెల్లి, ఆగస్టు 19 : మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో హర్కాపూర్ ఆంద్‌గూడ గ్రామ పంచాయతీ పరిధిలోని మామిడిగూడ(ఏ), మామిడిగూడ(జీ) గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. మంగళవారం కొంచెం వరద తగ్గడంతో గ్రామ పటేల్ మెస్రం గంగారాం తన కుమారుడు గురు ప్రసాద్‌కు జ్వరం రాకవడంతో భుజాలపై ఎత్తుకుని వాగు దాటాడు. మండల కేంద్రంలోని ఓ దవాఖానలో వైద్యం అందించాడు. అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించి మంజూరైన నిధులతో వాగు వద్ద కల్వర్టు నిర్మించాలని ఆదివాసులు కోరుతున్నారు.
బాసర, ఆగస్టు 19 : బాసర వద్ద గోదావరి వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీగా వరద వచ్చి చేరుతున్నది. ఎగువన గల మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో వరద చేరడంతో నిండుకుండను తలపిస్తున్నది. గోదావరి లోకి స్నానాలకు వెళ్లొద్దని, చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.