మంచిర్యాల, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : “బీఆర్ఎస్ గెలుపుకోసం కలిసి కట్టుగా పనిచేస్తాం. మంచిర్యాల నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరేస్తాం. మా ఎమ్మెల్యే అభ్యర్థి దివాకర్‌రావుకు మచ్చలేని నాయకుడన్న పేరుంది. అదే హస్తం పార్టీ అభ్యర్థిపై అవినీతి, కబ్జా ఆరోపణలున్నాయి. ఈ ఇద్దరిలో ఎవ్వరితో మేలు జరుగుతుందో ప్రజలందరికీ తెలుసు. నిత్యం అందుబాటులో ఉంటూ.. నిస్వార్థంగా సేవలందిస్తున్న మా అభ్యర్థినే ఎన్నుకుంటారన్న విశ్వాసముంది. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి కారు గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాలని కోరుతున్న.” అని నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ భానుప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక విషయాలు పంచుకున్నారు.
నమస్తే తెలంగాణ : మంచిర్యాలలో బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ఎలా ముందుకు పోతున్నారు.?
భానుప్రసాద్ : మంచిర్యాల నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులందరినీ సమీకృతం చేస్తాం. ప్రతి ఒక్కరూ పార్టీ కోసం పూర్తిస్థాయిలో పని చేసేలా చూస్తాం. ఎవరైతే ఉద్యమంలో పాల్గొని కష్టపడ్డారో, ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వారికి రానున్న రోజుల్లో సముచిత గౌరవం కల్పిస్తాం. కొత్త.. పాత కలయికతో సమష్టిగా పని చేసి పార్టీని గెలిపించుకుంటాం. రాష్ట్రస్థాయిలోనూ పాత వాళ్లు, కొత్త వాళ్లు అంతా కలిసి పని చేస్తున్నారు. కాబట్టే పార్టీ పటిష్టమైన స్థాయికి రాగలిగింది. మంచిర్యాల నియోజకవర్గంలోనూ అందరినీ కలుపుకొని ఒక ప్రణాళికా బద్ధంగా, వ్యూహాత్మకంగా పని చేసుకుంటూ వెళ్తాం.
నమస్తే తెలంగాణ : కాంగ్రెస్ పార్టీ టికెట్ ప్రకటించాక ఆ పార్టీలో అసంతృప్తులు పెరిగారు. బీఆర్ఎస్ చేరేందుకు ఎవరైనా ముందుకు వస్తే చేర్చుకుంటారా..?
భానుప్రసాద్ : తప్పకుండా చేర్చుకుంటాం. తెలంగాణ అభివృద్ధిని చూసి, సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు మెచ్చి ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు సంబంధించిన వారు మా పార్టీలోకి వచ్చారు. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఏదో అవతలి పార్టీల వారు ఆర్థికంగా ప్రలోభపెట్టాలని చూస్తున్నారు. కానీ ఎంత సేపు డబ్బులతో నిలిచే పరిస్థితి ఉండదు. ఒకరిద్దరు మా పార్టీకి సంబంధించిన వారు వేరే పార్టీల్లోకి పోయి ఇబ్బందులు పడుతున్నారు. నిన్నటి వరకు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు బాగుంటిమి అన్న ఫీలింగ్‌లో ఉన్నారు. వాళ్లు కూడా చాలా మంది రిటర్న్ రావాలనే ఆలోచనలో ఉన్నారు. ఎవ్వరొచ్చినా మా పార్టీకి ఉపయోగపడుతారు. జనంలో మంచి పేరు ఉందనుకుంటే కచ్చితంగా వారిని ఆహ్వానిస్తాం.
నమస్తే తెలంగాణ : మంచిర్యాల ప్రాంతంతో మీకున్న అనుబంధం ఏమిటి?
భానుప్రసాద్ : నాకు మంచిర్యాలలో వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. కుటుంబ పరంగా, కమ్యూనిటీ పరంగా చాలా మంది తెలుసు. దీంతోపాటు చాలా మంది నాయకులతో నేను ఇప్పటికే కలిసి పని చేశాను. నాది పక్కనున్న పెద్దపల్లి నియోజకవర్గమే, ఈ ప్రాంతంపై నాకు పూర్తి అవగాహన ఉంది. ఇక్కడి నాయకులందరితో సత్సంబంధాలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో కింది వరకు వెళ్లి ప్రతి కార్యకర్తతో అటాచ్ అయ్యే ప్రయత్నం చేస్తాను. వాళ్లందరినీ కలుపుకొని, మంచి వాతావరణంలో ఈ ఎన్నికల్లో ప్రతి కార్యకర్తను భాగస్వామ్యం చేసుకుంటూ ముందుకు వెళ్తాను.
నమస్తే తెలంగాణ : బీఆర్ఎస్ అభ్యర్థి దివాకర్‌రావుకు ఎందుకు ఓటేయాలి.. మంచిర్యాల ప్రజలకు మీరు ఇచ్చే పిలుపు ఏమిటి?
భాను ప్రసాద్ : సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో ఉన్న మా పార్టీ అభ్యర్థి దివాకర్‌రావుకు ఒక స్వచ్ఛమైన ట్యాగ్ ఉంది. అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని వ్యక్తి.. అదే ఎదురుగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈయనకు డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు మా డబ్బులు మాకు రాలేదు అని పోరాటం చేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. హైదరాబాద్‌లో ఓ హౌసింగ్ సొసైటికీ సంబంధించిన వాళ్లు ఈయన భూములు కబ్జా చేశారని ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పారు. ఇలా అనేక రకాలైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఒకవైపు, దాదాపు 40 సంవత్సరాల చరిత్రలో మచ్చలేని రాజకీయ జీవితాన్ని నడిపిన వ్యక్తి మరోవైపు. ఈ ఇద్దరి మధ్య జరిగే పోరాటంలో కచ్చితంగా ప్రజలు దివాకర్‌రావు వైపే ఉంటారనే సంపూర్ణమైన నమ్మకం మాకు ఉంది.
నమస్తే తెలంగాణ : ఏ నినాదం, ఏ విధానంతో ఈ ఎన్నికల్లో పని చేస్తారు?
భాను ప్రసాద్ : సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో గడిచిన పదేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు మా నినాదం. గత యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో జరగని అభివృద్ధి, అసాధ్యం అనుకు న్న పనులను సుసాధ్యం చేసింది బీఆర్ఎస్ సర్కార్. ఈ పదేళ్ల లో మంచిర్యాలలో అనేకమైన అభవృద్ధి పనులు జరిగాయి. మంచిర్యాలను జిల్లా కేంద్రం చేయాలని గతంలో అనేక ఉద్యమాలు జరిగాయి. కానీ తెలంగాణ వచ్చాకే మంచిర్యాలను జిల్లా చేశారు. ఇక్కడ ఒక మెడికల్ కాలేజీ కావాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. గతంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీ పాలకులు ఎవ్వ రూ చేయలేనిది ఈ రోజు దివాకర్‌రావు నేతృత్వంలో సీఎం ఆశీర్వాదంతో సాధించుకున్నాం. ప్రజలకు మేం చేసినవి చెప్తాం, రాబోయే రోజుల్లో మేం చేయబోయేటివి చెప్తాం. మా మ్యానిఫెస్టోను వివరించుకుంటూ ప్రచారంలో ముందుకుపోతాం.