
ఉట్నూర్ రూరల్, డిసెంబర్ 6: యాసంగిలో ఇతర పంటలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి ఆశా కుమారి రైతులకు సూచించారు. సోమవారం మండలంలోని బిర్సాపేట్, దంతన్‌పల్లి గ్రామాల్లో యాసంగి పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ వరికి బదులు వేరుశనగ, శనగ, జొన్న, మినుములు, పెసర, నువ్వులు, కూరగాయలు సాగు చేయాలని సూచించారు. యాసంగిలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయదని, ఐకేపీ కేంద్రాలు ఉండవని తెలిపారు .కార్యక్రమంలో ఏడీఏ రమేశ్, వ్యవసాయాధికారి గణేశ్, ఏఈవోలు సాయికృష్ణ, జయశ్రీ పాల్గొన్నారు.
బేల, డిసెంబర్ 6: రైతులు ఇతర పంటలు సాగు చేస్తేనే లాభాలు పొందుతారని సర్పంచ్ రాకేశ్ అన్నారు. డోప్టాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏఈవో రాజు రైతులతో కలిసి వ్యవసాయ క్యాలెండర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పత్తి, కూరగాయలు, పప్పు ధాన్యాల పంటలపై దృష్టి సారించాలని సూచించారు.
భీంపూర్, డిసెంబర్ 6: అంతర్గాం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏఈవో సాయిప్రసాద్, రైతు బంధు సమితి గ్రామ అధ్యక్షుడు మేకల బక్కన్నయాదవ్ వ్యవసాయ క్యాలెండర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఈవో మాట్లాడుతూ నల్లరేగడి భూముల్లో పప్పు ధాన్యాలు, ఆరుతడి పంటలు వేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ముకుంద్, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
తలమడుగు, డిసెంబర్ 6: యాసంగిలో వరికి బదులు ప్రభుత్వం సూచించిన ఇతర పంటలు సాగు చేయాలని మండల వ్యవసాయాధికారి మహేందర్ రైతులకు సూచించారు. మండలంలోని కొత్తురు గ్రామంలో ప్రభుత్వం ముద్రించిన రైతులు సాగు పంటల వివరాల పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరికి బదులుగా వేరుశనగ, శనగ, జొన్న, పెసర, మినుములు, నువ్వులు పండించాలన్నారు. కార్యక్రమంలో ఏఈవో సరిత, తదితరులు పాల్గొన్నారు.
ఉట్నూర్, డిసెంబర్ 6: మండల కేంద్రంలోని రైతువేదికలో ఏఈవో సుధాకర్ రైతులకు ఇతర పంటలపై అవగాహన కల్పించి కరపత్రాలు విడుదల చేశారు. కార్యక్రమంలో రైతులు రాంబాబు, మోతీరాం, లక్ష్మణ్, విశ్వనాథ్, భీంరావు, తదితరులు పాల్గొన్నారు.