కాసిపేట, ఫిబ్రవరి 10 : కాసిపేట మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీకి సంబంధించి మైనింగ్ లీజుపై ఈ నెల 15న నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. దేవాపూర్, మద్దిమాడ, గట్రావ్‌పల్లి గ్రామ పంచాయతీల్లో విస్తరించి ఉన్న ఓరియంట్ సిమెంట్ కంపెనీ ప్రతి సారి ప్రజాభిప్రాయ సేకరణలో ఉపాధి కల్పిస్తామని, అభివృద్ధి చేస్తామని మాట ఇస్తూ మైనింగ్ లీజును పొందుతూ ఉద్యోగాలివ్వకుండా మోసం చేస్తున్నారని స్థానికులు మండి పడుతున్నారు. పాత హామీలే ఇంత వరకు అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటిపై రాజకీయ నేతలు, కార్మిక యూనియన్ల నాయకులు స్పందించకుండా కంపెనీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామ పంచాయతీలో ఈ నెల 15న టీఎస్‌పీసీబీ నిజామాబాద్ వారితో నిర్వహించే టీఎస్ఎండీసీ హైదరాబాద్ వారి 588.26 హెక్టార్ల మైనింగ్ లీజు కోసం జరగబోయే ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంపై స్థానికులు నుంచి నిరసన వ్యక్తమవుతున్నది. 2018 సంవత్సరంలో టీఎస్ఎండీసీ హైదరాబాద్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, ైక్లెమెట్ చేంజ్ న్యూఢిల్లీ సమర్పించిన ఫాం-1, టర్మ్ ఆఫ్ రిఫరెన్స్, ప్రీ ఫెసిబులిటీ రిపోర్ట్ సమర్పించిన దాని ప్రకారం 2018లో 275 హెక్టార్ల మైనింగ్ లీజును ఆమోదం పొందడానికి గాను 315 స్థానికులకు మైనింగ్‌లో పర్మినెంట్‌గా ఉద్యోగాలు ఇస్తామని, సిమెంట్ కంపెనీలో 2200 మందికి పర్మినెంట్‌గా ఉద్యోగాలు ఇస్తామని, దీని ద్వారా దాదాపు 11000 మందికి జీవనోపాధి లభిస్తుందని తెలియజేసి మైనింగ్ లీజును పొందారని, ఇప్పటి వరకు ఎలాంటి ఉద్యోగాలివ్వలేదని స్థానికులు మండిపడుతున్నారు.
మళ్లీ ఇప్పుడు కూడా స్థానికులను మోసం చేయడానికి తిరిగి దేవాపూర్ గ్రామ పంచాయతీలో ఫిబ్రవరి 15న టీఎస్‌పీసీబీ నిజామాబాద్ వారిచే నిర్వహించే టీఎస్ఎండీసీ హైదరాబాద్‌వారి 588.26 హెక్టార్ల మైనింగ్ లీజు కోసం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్, ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ ప్లాన్ ద్వారా మరల 588.26 హైక్టార్ల రిజర్వ్ ఫారెస్ట్ భూమిని లీజుకు తీసుకొని 189 మంది స్థానికులకు అర్హతను బట్టి ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారని, గతంలో చెప్పిన వాటినే పాటించకుండా తిరిగి ఫిబ్రవరి 15న ప్రజాభిప్రాయ సేకరణను వ్యతిరేకిస్తున్నట్లు స్థానిక నిరుద్యోగులు, గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు.
2018లో చెప్పిన విధంగా స్థానికులకు వెంటనే ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మరల పెసా చట్టం ప్రకారం గ్రామ సభ నిర్వహించి, గ్రామ సభలో ఆమోదం పొందిన తర్వాతనే ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 2018లో తీసుకున్న మైనింగ్‌లో ఉద్యోగాలను వేరే రాష్ర్టాల నుంచి ఉద్యోగులను కాంట్రాక్ట్ బేసిక్ నందు పెట్టుకొని పనులు చేయించుకుంటున్నారని, దీంతో ఓరియంట్పై పూర్తిగా నమ్మకం లేకుండా పోయిందన్నారు. ఇక మళ్లీ నమ్మే పరిస్థితి లేదని తెలిపారు. కనీసం స్థానికుల తరఫున పోరాటాలు చేయాల్సిన రాజకీయ నాయకులు, కార్మిక యూనియన్ల నాయకులు పట్టించుకోవడం లేదని మండి పడుతున్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్‌కు సైతం గత మైనింగ్ లీజు ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలు, అభివృద్ధి చేశాకే మళ్లీ ఇప్పటి మైనింగ్ లీజు ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని స్థానికులు వినతిపత్రం సైతం అందించారు.
ఓరియంట్ సిమెంట్ కంపెనీ ఎప్పుడు స్థానికులకు అన్యాయమే చేస్తుంది. 2018లో ఏదైతే హామీలు ఇచ్చి నమ్మ బలికి లీజు తీసుకొని కోట్లు సంపాదిస్తూ మళ్లీ ఇప్పుడు మోసం చేసి మైనింగ్ లీజును పొందడానికి ప్రయత్నిస్తున్నది. స్థానికులకు ఉద్యోగాలు కల్పించిన తర్వాతనే మైనింగ్ లీజును చేపట్టాలి. ప్రశ్నించే వారిని టార్గెట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎలాగైనా ప్రజాభిప్రాయ సేకరణను విజయవంతం చేయాలని చూస్తున్నది. స్థానికులను మభ్య పెట్టడానికి బిర్యానీలు పెట్టి, ఇతర ఆశలు పెట్టి పొందాలని కుట్రలు చేస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణను స్థానికులు, ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మాకు అన్యాయం చేస్తే కోర్టును ఆశ్రయిస్తాం.
– రొడ్డ రవి కుమార్ (స్థానిక నిరుద్యోగి)
గతంలో స్థానిక నిరుద్యోగులమంతా కలిసి ఉద్యోగాల కోసం పారాటాలు చేశాం. కాని ఇప్పటి వరకు ఉద్యోగాలివ్వలేదు. ఇప్పుడు కూడా ఇవ్వరు. ఈ సారి మైనింగ్ ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకుంటాం. స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చి ప్రభావిత గ్రామాలను అభివృద్ధి చేయాలి. తర్వాతే మైనింగ్ లీజు చేపట్టాలి. ఓరియంట్ కంపెనీతో భూగర్భ జలాలు కలుషితమై అనేక మంది కిడ్నీ సమస్యలు, మోకాళ్ల సమస్యలతో బాధ పడుతున్నారు. ఇన్ని బాధలు పడుతున్నా స్థానికులకు ఎలాంటి న్యాయం చేయడం లేదు. ఇక్కడి ముడిసరుకును ఇతర రాష్ర్టాలకు తరలిస్తున్నారు. ఇక్కడ ఖనిజ సంపద తగ్గిపోతుంది. భావి తరాలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు.
-దండవేణి చందు (యువశక్తి యూత్ అధ్యక్షుడు)