“ఔర్ ఏక్ దక్కా.. కేసీఆర్ పక్కా.. ఈ నినాదంతో ముందుకెళ్లి మరోసారి బీఆర్ఎస్ను గెలిపించుకోవాలి. గతంలో ఇక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు అభివృద్ధిని పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి ఆశీర్వాదంతో ఈ ప్రాంతం బాగుపడ్డది. చెన్నూర్‌ను ప్రగతి పథంలో నడిపించి ఆదర్శంగా నిలిపారు. ఈ యజ్ఞం ఇలాగే కొనసాగాలంటే మరోసారి గులాబీ జెండా తప్పక ఎగరేయాలి. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోకు అనూహ్య స్పందన వస్తున్నది.
దీనిని కచ్చితంగా అమలు చేసి తీరుతాం. ఇచ్చిని హామీలతో పాటు ఇవ్వని హామీలు సైతం నెరవేర్చిన ఘనత మాదే. ఈ పదేళ్లలో సాధించిన ప్రగతిని చూసి ఓటేయాలి.” అని ప్రభుత్వ విప్, చెన్నూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్ పేర్కొన్నారు. శుక్రవారం మందమర్రిలోని పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. వాడ వాడలా తిరిగి ఓట్లు అభ్యర్థించారు. వచ్చేనెల 7న సీఎం కేసీఆర్ పర్యటించనున్న నేపథ్యంలో ఆయన ఏర్పాట్లు పరిశీలించారు.
– మంచిర్యాల, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంచిర్యాల, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఔర్ ఏక్ దక్కా.. కేసీఆర్ పక్కా అని, ఈ నినాదంతో ముందుకు సాగి ముచ్చటగా మూడోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేసుకోవాలని ప్రభుత్వ విప్, చెన్నూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్ పిలుపునిచ్చారు. శుక్రవారం తనకు సెంటిమెంటైన మందమర్రి పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా నేను, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని కార్యకర్తలు, నాయకులమంతా కలిసి ప్రత్యేక పూజలు చేశామన్నారు. తెలంగాణ వచ్చాకే మందమర్రి పట్టణం బాగుపడిందన్నారు. మందమర్రి పట్టణం మీదుగా వెళ్తున్న జాతీయ రహదారితో 296 ఇండ్లు కూలిపోతాయంటే.. వెంటనే ైప్లెఓవర్ బ్రిడ్జి నిర్మించామని తెలిపారు. ఇక్కడ అద్భుతమైన కేసీఆర్ పార్క్ నిర్మించామని చెప్పారు. రాబోయే రోజుల్లో మందమర్రి పట్టణం మరింత ప్రగతి సాధించాలంటే రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వమే ఉండాలని పేర్కొన్నారు. సౌత్ ఇండియాలో వరుసగా మూడోసారి ఎవ్వరు కూడా ముఖ్యమంత్రి కాలేదేని, ఈ ఎన్నికల్లో ఆ గౌరవాన్ని మనం కేసీఆర్ సార్‌కు ఇద్దామని పిలుపునిచ్చారు.
చెన్నూర్ నియోజకవర్గ ప్రగతి ప్రదాత మన సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ప్రాణహిత, గోదావరి నదులు మన ప్రాంతం నుంచే ప్రవహిస్తున్నా.. గత పాలకులు పొలాలకు చుక్కనీరందించింది లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుణ్యమాని రూ. 1658 కోట్లతో చెన్నూర్ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించుకొని లక్ష ఎకరాలకు నీరు తెచ్చుకోబోతున్నామన్నారు. మందమర్రిలో రూ.500 కోట్ల పామాయిల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మూడు మున్సిపాలిటీలకు రూ.700 కోట్లపై చిలుకు నిధులు ఇచ్చి అభివృద్ధి చేసుకున్నామన్నారు. వాగులు.. వంకల మీద 22 బ్రిడ్జిలు నిర్మించుకున్నట్లు తెలిపారు.
చెన్నూర్ రెవెన్యూ డివిజన్, పారుపల్లి, ఆస్నాద్లను మండలాలుగా ఏర్పాటు చేసుకున్నామన్నారు. భీమారం నూతన మండలం, చెన్నూర్, క్యాతనపల్లి మున్సిపాలిటీల ఏర్పాటు ఇవ్వన్నీ కేసీఆర్ ఆశీర్వాదంతోనే అయ్యాయని చెప్పారు. చెన్నూర్ నియోజకవర్గంలో గతంలో మంత్రులు, మూడు, నాలుగుసార్లు ఎమ్మెల్యేలుగా కొనసాగిన వారు ఈ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోలేదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో ఎంతో ప్రగతి సాధించామని, ఈ అభివృద్ధి యజ్ఙం ఇలాగే కొనసాగాలంటే చెన్నూర్ నియోజకవర్గంలో తప్పనిసరిగా గులాబీ జెండా ఎగరాల్సిన అవసరముందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం పదేళ్ల ప్రగతికి కొనసాగింపుగా అద్భుతమైన మ్యానిఫెస్టోను విడుదల చేసిందన్నారు. ఈ మ్యానిఫెస్టోను తప్పకుండా అమలు చేస్తామని, గతంలో ఏ హామీ ఇచ్చి నా తూచా తప్పకుండా నెరవేర్చిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదేనని కొనియాడారు. ఇవ్వని హామీలు సైతం నెరవేర్చిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ సొంతమన్నారు.
ప్రజల నుంచి మ్యానిఫెస్టోకు అనూహ్య స్పందన వస్తుందని తెలిపారు. తెల్లరేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం అందించే అన్నపూర్ణ పథకం, కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా, మహిళలకు రూ.3 వేల చొ ప్పున అందించే సౌభాగ్యలక్ష్మి, వృద్ధులు, వితంతువుల పింఛన్ రూ.5 వేలు, దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలకు పెంచడం, రైతుబంధు రూ.16 వేలకు పెంపు, కేసీఆర్ ఆరోగ్య రక్ష పరిమితి రూ.15 లక్షలకు పెంపు, రూ.400లకే సిలిండర్వంటి ఎన్నో అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నామన్నారు. సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్న బీఆర్ఎస్ పార్టీని మరోసారి ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. ఆనాడు 14 ఏళ్ల ఉద్యమమైన, ఈ రోజు పదేళ్ల పాలనైనా ప్రజలే కేంద్రంగా మా నిర్ణయాలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.
వచ్చే నెల 7న ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ మందమర్రి పట్టణంలో మధ్యాహ్నం 12 గంటలకు సింగరేణి హై స్కూల్ గ్రౌండ్లో నిర్వహిస్తామన్నారు. మందమర్రితో పాటు నియోజకవర్గ ప్రజలందరూ ఈ సభకు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం బాల్క సుమన్ సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. స్టేజీ, సభ ప్రాంగణంలో టెంట్లు, ఎల్ఈడీ స్క్రీన్ల ఏర్పాటుపై నాయకులకు పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. చావు నోట్లో తలపెట్టి తెలంగాణను తెచ్చిన నాయకుడు, ఉద్యమాన్ని పటిష్టంగా నడిపిన నాయకుడు, తెచ్చిన రాష్ర్టాన్ని బంగారు తునుక చేస్తున్న నాయకుడు కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రి చేద్దామన్నారు.
ఔర్ ఏక్ దక్కా.. హ్యాట్రిక్ పక్కా.. నినాదంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రౌండ్లో పిల్లలతో సరదాగా కాసేపు క్రికెట్ ఆడారు. బ్యాటింగ్, బౌలింగ్ చేసి అలరించారు. సరిగ్గా అదే సమయానికి అక్కడికి వచ్చిన ఎంపీ వెంకటేశ్‌నేతతో పాటు తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్ పూస్కూరి రాంమోహన్రావుతో కలిసి మైదానం మొత్తం కలియ తిరిగారు. మైదానంలోకి వచ్చిన వాకర్స్‌ను పలకరించారు. అంతకుముందు మందమర్రి పట్టణంలోని ఏడో వార్డు, పాలచెట్టు ఏరియాల్లో ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. మందమర్రి పట్టణ పార్టీ అధ్యక్షుడు జే.రవీందర్, పట్టణ ఇన్చార్జి బత్తుల శ్రీనివాస్, పార్టీ సీనియర్ నాయకులు, వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.