అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ‘ఆరోగ్య మహిళ’కు శ్రీకారం చుట్టింది. ఆడబిడ్డల శ్రేయస్సే లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ కార్యక్రమం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బుధవారం అమల్లోకి వచ్చింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్పేట్ పీహెచ్‌సీతో పాటు మాతా శిశు సంరక్షణ కేంద్రం, ఆదిలాబాద్‌లోని హమాలీవాడ, బజార్హత్నూర్, భైంసా, తిర్యాణి మండలం గిన్నెధరి, దహెగాం, బెల్లంపల్లి మండలం తాళ్లగురిజాల, మంచిర్యాలలోని బస్తీదవాఖాన, జైపూర్ మండలం కుందారం, జన్నారం పీహెచ్‌సీల్లో బుధవారం అట్టహాసంగా ఆరంభమైంది. ఆయాచోట్ల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావ్, ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, కలెక్టర్లు వరుణ్‌రెడ్డి, రాహుల్‌రాజ్, హేమంత్ బోర్కడే, బదావత్ సంతోష్ పాల్గొని ప్రారంభించగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
-ఆదిలాబాద్ (నమస్తే తెలంగాణ)/బజార్హత్నూర్ /నిర్మల్ చైన్‌గేట్/భైంసా, మార్చి 8
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ‘ఆరోగ్య మహిళ’ను తీసుకొచ్చింది. ఆడబిడ్డల శ్రేయస్సే లక్ష్యంగా అమలు చేస్తున్న ఈ పథకాన్ని బుధవారం ఉమ్మడి జిల్లాలోని 11 పీహెచ్‌సీల్లో అట్టహాసంగా ఆరంభించారు. ఆయాచోట్ల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో పాటు వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా, సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
నిర్మల్ చైన్‌గేట్, మార్చి 8: మహిళల ఆరోగ్య రక్షణ కోసమే ప్రత్యేకంగా ఆరోగ్య మహిళా కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని బంగల్ పేట, మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో బుధవారం ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు మహిళల సంపూర్ణ ఆరోగ్యానికి దేశంలో ఎక్కడా లేని విధం గా అనేక పథకాలను అమల్లోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఇప్పటికే టీ డయాగ్నస్టిక్ ద్వారా 57 రకాల వైద్య పరీక్షలు చేస్తున్నారని తెలిపారు. త్వరలోనే 450 పడకల దవాఖాన సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రసూతి వార్డులో గర్భిణులు, బాలింతలను పలకరించారు. మహిళా దినోత్సవం సందర్భంగా దవాఖానలో కేక్‌కట్ చేశారు. కలెక్టర్ వరుణ్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, డీఎంహెచ్‌వో ధన్‌రాజ్, సూ పరింటెండెంట్ దేవేందర్‌రెడ్డి, అధికారులు, పాల్గొన్నారు.
తిర్యాణి, మార్చి 8 : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఎమ్మెల్యే ఆత్రం సక్కు పిలుపునిచ్చారు. బుధవారం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గిన్నెధరి పీహెచ్సీలో ఆరోగ్య మహిళా కేంద్రాన్ని అదనపు కలెక్టర్ చాహత్బాజ్పాయితో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆరోగ్య మహిళా కేంద్రాన్ని ప్రారంభించిందన్నారు. ప్రతి మంగళవారం ఈ కేంద్రంలో ప్రత్యేక చికిత్సలు అందిస్తారని, ఎలాంటి సమస్యలున్నా నిర్భయంగా వచ్చి చూపించుకోవాలని సూచించారు. ఈ కేంద్రంలో సరిపడా సిబ్బందిని నియమించినట్లు వారు తెలిపారు. అనంతరం మహిళా సంఘాలకు మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కోవ అర్చన, ఎంపీపీ మర్సుకోల శ్రీదేవి, జిల్లా వైద్యాధికారి రామకృష్ణ, అదనపు వైద్యాధికారి సుధాకర్ నాయక్, డీఆర్డీవో సురేందర్, జిల్లా డీపీఎంలు రామకృష్ణ,యాదగిరి,గిన్నెధరి వైద్యురాలు మేరీనా, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు మడావి గుణవంతరావు, ఐకేపీ ఏపీఎం సదానందం, వైద్య సిబ్బంది, ఆశ, అంగన్వాడీలు పాల్గొన్నారు.
జన్నారం, మార్చి 8 : మండల కేంద్రంలోని పీహెచ్సీలో ఆరోగ్య మహిళా కేంద్రాన్ని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ ప్రారంభించారు. అనంతరం దవాఖాన ఆవరణలో మొక్కలు నాటారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.
జైపూర్, మార్చి 8: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందారంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో బుధవారం ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమాన్ని జడ్పీటీసీ మేడి సునీత ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ మహిళల ఆరోగ్య సమస్యలు పరిష్కరించేందుకే సీఎం చంద్రశేఖర్‌రావు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. కార్యక్రమంలో వైద్యురాలు శ్రావ్య, సర్పంచ్ ఇజ్జగిరి సమ్మయ్య, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
భైంసా, మార్చి 8: పట్టణంలోని అర్బన్ హెల్త్ సెంటర్లో మహిళల కోసం బుధవారం ప్రత్యేక క్ల్లినిక్ను ఏర్పాటు చేశారు. కౌన్సిలర్ ఫయాజుల్లాఖాన్ ఈ ప్రత్యేక కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ క్ల్లినిక్‌లో ప్రత్యేకంగా మహిళలకు 57 రకాల పరీక్షలు నిర్వహిస్తారని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏఎన్ఎంలు, వైద్యులను శాలువాతో సత్కరించారు. డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో ఇద్రీజ్, డా. మతీన్, బీఆర్ఎస్ నాయకులు ఫారూఖ్ హైమద్ ఉన్నారు.
ఆదిలాబాద్, మార్చి 8(నమస్తే తెలంగాణ): మహిళల ఆరోగ్యమే కుటుంబానికి రక్షగా మారుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని హమాలీవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయన కలెక్టర్ రాహుల్‌రాజ్‌తో కలిసి ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. మహిళల సంక్షేమానికి రాష్ట్ర సర్కారు పెద్దపీట వేస్తున్నదని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆరోగ్యలక్ష్మి, అమ్మఒడి, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి, ప్రతి మంగళవారం వారికి మాత్రమే వైద్యసేవలు అందేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ రాహుల్‌రాజ్ మాట్లాడుతూ మహిళలు తమ ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం మంచి అవకాశం కల్పించిందన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, ట్రైనీ కలెక్టర్ శ్రీజ, మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరీబాయి, జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్, మున్సిపల్ కమిషనర్ శైలజ, కౌన్సిలర్ సందీప్, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నాకు థైరాయిడ్ ఉంది. ఆరోగ్య మహిళా కేంద్రం లో చూపెట్టుకుందామని వచ్చిన. పరీక్షలు చేసి మందులు ఇచ్చిన్రు. మహిళలు ఆరోగ్యంగా ఉండ డానికి ప్రభుత్వం ప్రత్యేక వైద్యం అందించడం బాగుంది. ఇక్కడికి వచ్చిన వారందరికీ మందులు ఇస్తున్నరు. కేసీఆర్ సర్కారు మహిళల కోసం మంచి పథకాలు అమలు చేస్తున్నది. – అనిత, హమాలీవాడ, ఆదిలాబాద్
బెల్లంపల్లిరూరల్, మార్చి 8 : మండలంలోని తాళ్లగురిజాల పీహెచ్సీలో బుధవా రం ఆరోగ్య మహిళా క్లినిక్‌ను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, ఎంపీపీ గొమాస శ్రీనివాస్, ఎంపీటీసీ శకుంతల, వైద్యాధికారి డాక్టర్ అనీష్, బీఆర్ఎస్ పట్టణ అధికార ప్రతినిధి యాదగిరి, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, బెల్లంపల్లి మండల ఉపాధ్యక్షుడు భీమయ్య, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ కిరణ్, వేమనపల్లి మండలాధ్యక్షుడు వేణుమాధవ్, కౌన్సిలర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని అమలు చేయడం అభినందనీయం. ఇందులో ఆరోగ్యపరమైన సమస్యలకు పూర్తి పరిష్కారం లభిస్తుంది. దవాఖానల్లో మహిళా వైద్యులు, సిబ్బంది ఉంటే మా సమస్యలను చెప్పుకునే అవకాశం ఉంటుంది. ప్రతి మంగళవారం కేవలం మహిళల కోసం వైద్య సేవలు అందించడం బాగుంది. బీపీ, షుగర్‌తో పాటు క్యాన్సర్ లాంటి వాటికి కూడా వైద్యం అందించడం సంతోషకరం – ప్రేమలత, హమాలీవాడ, ఆదిలాబాద్
బజార్హత్నూర్, మార్చి 8: మహిళ లేనిదే సృష్టి లేదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. అంతర్జాతీయ మహి ళా దినోత్సవం సందర్భంగా బజార్హత్నూర్లోని పీహెచ్సీలో ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ ఆరోగ్య క్లినిక్ ద్వారా 57 రకాల టెస్టులు ఉచితంగా చేస్తామని చెప్పారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను ఘనంగా సత్కరించారు. అనంతరం నృత్యం చేశారు. సర్పంచ్ లావణ్య, ఎంపీపీ జయశ్రీ, ఎంపీటీసీ తిరుమల, జడ్పీటీసీ నర్సయ్య, మండల కన్వీనర్ రాజారాం, వైద్యాధికారులు భీంరావ్, శిల్ప, వైద్య సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పలువురు ప్రతిభావంతులకు బుధవారం పురస్కారాలు అందజేశారు. ఇందులో ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామ సర్పంచ్ గాడ్గే మీనాక్షి రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కమిషనర్ భారతీ హోళికేరి, చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్, కేయూ వీసీ రమేశ్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా రూ.లక్ష చెక్కు, ప్రశంసా పత్రాన్ని అందజేశారు.