నిర్మల్, జూలై 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో వరికి ప్రత్యామ్నాయంగా అధిక లాభాలు వచ్చే వాణిజ్య పంటలతో రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చాలని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కన్న కలలు సాకారమవుతున్నాయి. నిత్యం ఒకేరకమైన పంటలు వేసి నష్టపోకుండా ‘ఆయిల్‌పామ్’ను ప్రోత్సహించారు. ప్రస్తుతం నిర్మల్ జిల్లాలో నాలుగేళ్ల కింద సాగు చేసిన తోటల్లో పంట చేతికి వచ్చి సిరులు కురిపిస్తుండగా, రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,366 మంది రైతులు ఆయిల్‌పామ్ పంటను సాగు చేశారు. ఈ నాలుగేళ్లలో 8,500 ఎకరాల్లో సాగు చేయగా, ఈ ఏడాది మరో 4,500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ తోటలను పెంచాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలి విడుతలో సాగు చేసిన ఆయిల్‌పామ్ తోటల్లో దిగుబడులు ఇప్పుడిప్పుడే జిల్లా రైతులకు అందుతున్నాయి. 2021-22లో దాదాపు 700మంది రైతులు 1500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేశారు. వీరిలో కొంతమంది రైతుల తోటల్లో గత నెల పంట దిగుబడులు మొదలయ్యాయి. ప్రస్తుతం ఎకరానికి టన్ను నుంచి రెండు టన్నుల ఆయిల్‌పామ్ గెలల దిగుబడి రావడంతో ప్రియూనిక్ కంపెనీ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా ఆయిల్‌పామ్ గెలల ధరలు మారుతూ ఉంటాయి. ప్రస్తుతం టన్నుకు రూ.17,400 ధరను కల్పించి ప్రియూనిక్ కంపెనీ కొనుగోలు చేస్తున్నది. రైతుల నుంచి కొనుగోలు చేసిన గెలలను ఎప్పటికప్పుడు ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేటలో గల ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి తరలిస్తున్నారు. పంట దిగుబడులను విక్రయించిన రైతులకు వారం రోజుల్లో వారి బ్యాంకు ఖాతాలో డబ్బులను జమ చేస్తున్నారు.
గత జూన్ నుంచి ఇప్పటి వరకు జిల్లాలోని 34 మంది రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటకు సంబంధించి రూ.7.35లక్షలను వారి ఖాతాల్లో జమ చేశారు. ఆయిల్‌పామ్ దిగుబడి రావడం మొదలైందంటే ఇక ఆ రైతుకు నెలనెలా ఆదాయం సమకూరుతుంది. ఒకసారి గెలలు కోత కొస్తే ఇక ప్రతినెలా ఎకరానికి టన్ను దిగుబడి వస్తుంది. అంటే 5 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేసిన రైతుకు ప్రతినెలా 5 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది. ఇలా ప్రస్తుతం ఉన్న ధరతో లెక్కిస్తే 5 ఎకరాల ఆయిల్‌పామ్ రైతుకు నెలకు రూ.87వేల వరకు ఆదాయం సమకూరుతుంది. ఆయిల్‌పామ్ మొక్క వయసు పెరిగే కొద్దీ దిగుబడి మరింత పెరుగుతుంది.
వచ్చే రెండు మూడు ప్రతి నెలా ఎకరానికి 3 టన్నులకు పైగా దిగుబడి వచ్చే అవకాశం ఉందని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ఆయిల్‌పామ్ ధరలు టన్నుకు రూ. 15 వేల నుంచి 20వేల వరకు ఉండడంతో రైతులకు ఏడాది పొడవునా మంచి ఆదాయం సమకూరుతుందని జిల్లాలో ఆయిల్‌పామ్ సాగును పర్యవేక్షిస్తున్న ప్రియూనిక్ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. మొత్తానికి ఆయిల్‌పామ్ సాగుతో రైతులకు ఆదాయం వస్తుండడంపై ఆనందం వ్యక్తమవుతున్నది.
రైతులను లాభాల బాట పట్టించడమే కాకుండా, ప్రత్యామ్నాయ సాగువైపు దృష్టి సారించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగును ఎంతో ప్రోత్సహించింది. ఆయిల్‌పామ్ సాగుకు ముందుకు వచ్చిన రైతులకు అనేక సబ్సిడీలతో పాటు డ్రిప్ ఇరిగేషన్ సదుపాయాన్ని కల్పించింది. నాలుగేళ్ల పాటు పంట నిర్వహణ, ఎరువుల కోసం ఎకరానికి రూ.4,200 చొప్పున అందించింది. జిల్లా రైతులకు అందుబాటులో ఉంచేందుకు సారంగాపూర్ మండలం బీరవెల్లి వద్ద పెద్ద ఎత్తున నర్సరీని ఏర్పాటు చేసి ఆయిల్‌పామ్ మొక్కలు పెంచారు.
రూ.200 విలువ గల మొక్కకు 180 సబ్సిడీ ఇచ్చి కేవలం రూ.20లకే మొక్కను రైతులకు అందించింది. దీంతో నిర్మల్ జిల్లాలో పెద్ద సంఖ్యలో రైతులు ఆయిల్‌పామ్ తోటలను పెంచేందుకు ముందుకు వచ్చారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా దాదాపు 8,500 ఎకరాల్లో రైతులు ఆయిల్‌పామ్ తోటలను సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో పండిన ఆయిల్‌పామ్ దిగుబడులను ఇక్కడే విక్రయించేందుకు అనుగుణంగా జిల్లాలోని పాక్పట్ల ప్రాంతంలో పామాయిల్ పరిశ్రమ ఏర్పాటుకు అప్పటి మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.
పరిశ్రమ నిర్మాణానికి అవసరమైన ఇరిగేషన్ అనుమతులు రాని కారణంగా నేటికీ పనులు ప్రారంభం కాలేదు. పరిశ్రమ నిర్మాణం పూర్తయ్యే వరకు పంట కొనుగోలు బాధ్యత పూర్తిగా ప్రియూనిక్ కంపెనీదే. ఆయిల్‌పామ్ తోటల పెంపకాన్ని పర్యవేక్షిస్తున్న ప్రియూనిక్ కంపెనీ రవాణా ఖర్చులు సైతం భరించి ఇక్కడి పంటను ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేటలో గల పామాయిల్ పరిశ్రమకు తరలిస్తున్నది. రవాణా, ఇతర ఖర్చులు లేకుండానే పంట దిగుబడులను అమ్ముకునే వెసులుబాటును ప్రియూనిక్ కంపెనీ కల్పిస్తుండడంపై ఆయిల్‌పామ్ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గుండంపెల్లి శివారులో నాకున్న 4 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేసిన. గత నెల జూన్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 40 రోజుల్లో మూడు సార్లు గెలలను కట్ చేసి దిలావర్పూర్లోని కొనుగోలు కేంద్రంలో విక్రయించిన. మూడు కటింగ్‌లో ఇప్పటి వరకు మొత్తం 4.5 టన్నుల గెలలను అమ్మగా రూ.80వేల వరకు ఆదాయం వచ్చింది. వచ్చే నెల నుంచి ఎకరానికి రెండు టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది. ఆయిల్‌పామ్ మొక్కలను ఒకసారి నాటితే 30 ఏళ్ల వరకు ఆదాయానికి ఎలాంటి డోకా ఉండదు. రైతులకు ఇంత స్థిరమైన ఆదాయం వచ్చే పంట మరోటి లేదు.
అందుకే రైతుల కష్టాలు తెలిసిన కేసీఆర్ ఆయిల్‌పామ్ సాగును ఎంతో ప్రోత్సహించారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగును పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆయిల్‌పామ్ సాగు చేసే రైతులకు గత ప్రభుత్వంలో అందిన విధంగా ప్రోత్సాహకాలు పూర్తిస్థాయిలో అందడం లేదు. ఉద్యానవన శాఖ అధికారులు ఆయిల్‌పామ్ సాగులో ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తూ.. పంటను విక్రయించుకునేందుకు అవసరమైన సహకారాన్ని అందిస్తున్నారు.
– ఎలాల చిన్నారెడ్డి, ఆయిల్‌పామ్ రైతు, (గుండంపెలి)్ల
రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగుకు కేసీఆర్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ తోటలను సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ మేరకు 2021లోనే కేబినెట్ అప్రూవల్ తీసుకున్నారు. ప్రతి సంవత్సరం 4 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు అయ్యేలా రైతులను సిద్ధం చేయాలని ప్రణాళికలు వేసుకున్నప్పటికీ, ఏడాదిన్నర కాలంగా అది ఆచరణకు నోచుకోవడం లేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయిల్‌పామ్ సాగుపై చిత్తశుద్ధి లేదు.
పాలకుల పట్టింపులేనితనం కారణంగా 2023-24, 2024-25లో రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల ఎకరాల్లో కూడా ఆయిల్‌పామ్ సాగు కాలేదు. తోటల నిర్వహణకు 6 నెలలకోసారి ఇచ్చే రూ.2,100లను సమయానికి ఇవ్వడం లేదు. దీంతో ఆయిల్‌పామ్ సాగుకు రైతులు ముందుకు రావడం లేదు. వరి రైతులకు బోనస్ ఇస్తున్నట్లే, ఆయిల్‌పామ్ రైతులకు కూడా ఏడాది పొడవునా పంట నిర్వహణ కోసం ఎకరానికి రూ.10వేల ప్రోత్సాహకాన్ని ఇవ్వాలి. తక్కువ పెట్టుబడి, పర్యావరణానికి ఎంతో మేలు చేసే ఆయిల్‌పామ్ సాగును పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – వెంకట్రాంరెడ్డి, రాష్ట్ర ఉద్యానవన శాఖ మాజీ కమిషనర్
నేను 2021 సంవత్సరంలో నా పేరుమీద ఉన్న 3 ఎకరాల 10 గుంటల్లో, అలాగే మా భార్య శైలజ పేరుమీద ఉన్న 3 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలను నాటినం. గత జూన్ నెలలో మొదటి సారి మూడెకరాల్లో కొన్ని చెట్లకు గెలలు కోతకు వచ్చినయ్. వాటిని టన్నుకు రూ.20వేల ధరతో అమ్మితే రూ.35వేల ఆదాయం వచ్చింది. ఈ నెల మొదటి వారంలో 3 టన్నులకు పైగా దిగుబడి రాగా టన్నుకు రూ.17,400 చొప్పున ధరతో విక్రయించిన. రూ.58వేల వరకు ఆదాయం వచ్చింది. ఇలా ప్రతి నెల గెలలు కోతకు వస్తున్నయి. దిలావర్పూర్లోనే ప్రి యూనిక్ కంపెనీ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కంపెనీ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలిస్తూ పంటను కొనుగోలు చేస్తున్నరు. వారం రోజుల్లోనే బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతున్నయి.
– కొమ్ముల బుచ్చారెడ్డి, ఆయిల్‌పామ్ రైతు, (గుండంపెల్లి)