మంచిర్యాలటౌన్, నవంబర్ 19 : మంచిర్యాల పట్టణంలో చిత్రవిచిత్రమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా మున్సిపల్ అధికారులు చేస్తున్న పనులు వారికి కూడా అర్థమవుతున్నాయో.. లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టణంలో అత్యంత రద్దీగా ఉండే మార్కెట్ రోడ్లో ఆక్రమణల తొలగింపు, రోడ్డు వెడల్పు పేరిట భవనాలకు మార్కింగ్ ఇచ్చి కూల్చుతున్నారు. ఇదే సమయంలో ఎలాంటి టెండర్లు లేకుండానే డ్రైనేజీని నిర్మించాలన్న ఆలోచనతో అర్చన టెక్స్ చౌరస్తా నుంచి మార్కెట్ రోడ్ కింద వైపునకు 10 అడుగుల లోతు, ఐదడుగుల వెడల్పుతో కందకాన్ని తవ్వారు. ఆ మట్టిని ఇతర ప్రాంతాలకు తరలించారు. జేసీబీని ఉపయోగించి చేసిన ఈ పనులకు ఎంత ఖర్చయిందో తెలియదు.
అసలు పనులు ఎవరు చేస్తున్నారో కూడా తెలియదు. తవ్విన మట్టిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో అర్థం కాని పరిస్థితి.. ఈ అంశాలే ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయంటే.. తవ్విన కందకాన్ని తిరిగి పూడ్చేశారు. సోమవారం రాత్రి లారీలతో మట్టిని తీసుకువచ్చి జేబీసీ సాయంతో కాలువను పూడ్చారు. ఇదంతా చూస్తున్న వ్యాపారులు, ప్రజలకు అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. నిబంధనలు పాటించకుండా, టెండర్లు లేకుండా పనులు చేయడంపై ఇటీవల పలు పత్రికల్లో కథనాలు రాగా, ఉన్నతాధికారులు సీరియస్ అయినట్లు తెలుస్తున్నది. వారి మందలింపుల కారణంగానే ఈ పూడ్చివేతలకు దిగినట్లు పట్టణ వాసులు గుసగుసలాడుకుంటున్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్‌ను వివరణ కోరేందుకు యత్నించగా ఆయన అందుబాటులో లేరు.