నిర్మల్, నవంబర్ 5(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లాలో నేటి(బుధవారం) నుంచి ఇంటింటా సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. సర్వే నిర్వహణ కోసం అవసరమైన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఈ సర్వేలో ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ, వ్యవసాయ శాఖల సిబ్బందితోపాటు ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న వారిని పూర్తి స్థాయిలో భాగస్వాములను చేయనున్నారు.
అత్యవసర శాఖలను మినహాయించి, మిగతా అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బందిని సర్వే కోసం వినియోగించుకోవాలని తాజాగా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో సర్వేను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 2,24,487 ఇండ్లు ఉండగా, ప్రస్తుత లెక్కల ప్రకారం 20 శాతం అదనంగా 2,69,384 ఇండ్లు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు.
ఆయా ఇండ్లను సర్వే చేసేందుకు 1,796 మంది ఎన్యూమరేటర్లు, 179 మంది సూపర్వైజర్లను నియమించారు. ప్రతి 150 ఇండ్లకు ఒక ఎన్యూమరేషన్ బ్లాకుగా ఏర్పాటు చేసి దానికి ఒక ఎన్యూమరేటర్‌ను కేటాయించారు. అలాగే సమాచార సేకరణ, పర్యవేక్షణ బాధ్యతలను సూపర్వైజర్లు నిర్వర్తిస్తారు. ఎన్యూమరేటర్లు నిర్వహించిన సర్వే వివరాలను సూపర్వైజర్లు ర్యాండమ్‌గా తనిఖీ చేసి ఏవైనా లోటుపాట్లు ఉంటే ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించి వాటిని సరి చేస్తారు.
అయితే ఈ సర్వేలో ప్రధాన, ఉప ప్రశ్నలతో కలిపి మొత్తం 75 అంశాలకు సంబంధించిన వివరాలను సేకరించనున్నారు. సేకరించిన కుటుంబాల వివరాలను మండల స్థాయిలో ఆన్లైన్లో నమోదు చేయనుండడంతో ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారు, ఇంకా మిగిలిన అర్హుల వివరాల లెక్క తేలనున్నది. ప్రభుత్వ పరంగా చేపట్టే కార్యక్రమాలకు ఈ సర్వే కీలకం కాబోతున్నది. కాగా.. ఈ సర్వేను ఈ నెల 6 నుంచి ప్రారంభించి పక్షం రోజుల్లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సమగ్ర సర్వే పూర్తి చేసిన ప్రతి ఇంటికి స్టిక్కర్లు అతికించనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న సమగ్ర కుటుంబ సర్వేలో కుటుంబ సభ్యులకు సంబంధించిన సర్వం వివరాలు నమోదు కానున్నాయి. ఇందుకోసం 8 పేజీలతో కూడిన ఫార్మాట్లో 56 అంశాలకు సంబంధించిన వివరాలను సేకరించాల్సి ఉన్నది. వాటి ఆధారంగా ఇంటి యజమాని నుంచి పూర్తి వివరాలు తీసుకోనున్నారు. 2011లో జనగణన, 2014లో కేసీఆర్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే జరుపగా మళ్లీ పదేండ్ల తర్వాత ప్రస్తుత ప్రభుత్వం ఇంటింటి సర్వే చేయతలపెట్టింది.
ఒక వంటగదిని ఆధారంగా చేసుకుని దాని పరిధిలో నివసిస్తున్న కుటుంబ సభ్యులందరినీ కలిపి ఒక కుటుంబంగా గుర్తించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇలా జిల్లాలో ఉన్న మొత్తం ఇండ్లను ఈ నెల 6,7,8వ తేదీల్లో గుర్తిస్తారు. ఆ తర్వాత 9వ తేదీ నుంచి ఎన్యూమరేటర్లు క్షేత్ర స్థాయికి వెళ్లి సర్వే మొదలు పెడతారు. ఈ సర్వేలో కుటుంబ యజమాని, కుటుంబ సభ్యుల వివరాలు, కులం, వయస్సు, భాష, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, దివ్యాంగులు, వివాహితుల వివరాలు, విద్యార్హతలు, బడి మానేస్తే ఎప్పుడు మానేశారో కూడా తెలుసుకుంటారు. చేస్తున్న ఉద్యోగం, ఉపాధి, వృత్తి, వ్యాపార వివరాలతోపాటు వార్షిక ఆదాయం, రోజూవారీ వేతన వివరాలు, కార్మికులయితే ఏ రంగంలో పని చేస్తున్నారనేది తీసుకుంటారు.
కులవృత్తులైతే ఆ వివరాలను నోట్ చేస్తారు. కులవృత్తి కారణంగా కలిగిన వ్యాధుల వివరాలు కూడా సేకరించనున్నా రు. వార్షిక ఆదాయం, ఆస్తులు, బ్యాంకు రుణాలను కూడా ఈ ఫార్మాట్లో నమోదు చేయనున్నారు. ఆదాయపన్ను చెల్లింపుదారులా? బ్యాంకు ఖాతాలు ఎన్ని ఉన్నాయి? మొదలగు వివరాలు తెలుసుకుంటారు. పంట భూములు, వాటికి సాగునీటి వసతి ఉన్నదా? ధరణి పాస్‌బుక్ నంబర్, ఒకవేళ భూమి కౌలు చేస్తున్నైట్లెతే సాగు విస్తీర్ణం వివరాలు తీసుకుంటారు. అంతేకాకుండా రిజర్వేషన్ విధానం ద్వారా పొందిన విద్య, ఉద్యోగ ప్రయోజనాలు, ఐదేళ్లుగా లబ్ధి పొందిన పథకాల పే ర్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్లూఎస్ వారైతే కుల దృవీకరణ పత్రం పొందారా లేదా అనే వివరాలు తెలపాల్సి ఉంటుంది. ఇలాంటి అనేక అంశాలతో పాటు చివరగా రాజకీయ నేపథ్యం గురించి కూడా ఈ సర్వేలో సేకరించనుండటం గమనార్హం.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కోసం వచ్చే అధికారులకు ప్రజలు పూర్తిగా సహకరించాలి. రేషన్‌కార్డు, ఆధార్ కార్డుతో పాటు పూర్తి కుటుంబ వివరాలను అధికారులకు తెలియజేయాలి. అప్పుడే ప్రభుత్వ పథకాలకు అర్హులైన వారి వివరాలు నమోదు చేయబడుతాయి. కుటుంబ వివరాలు తెలియజేయడం వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలు యథావిధిగా లబ్ధిదారులకు అందుతాయి. ఎన్యూమరేటర్లు నిర్వహించిన సర్వే వివరాలను ఏ రోజుకారోజు మండలాల వారీగా అధికారుల పర్యవేక్షణలో ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఈ సర్వే ద్వారా జిల్లాలోని ఇండ్లు, జనాభా, ఇతర వివరాలన్నీ స్పష్టంగా తెలిసిపోతాయి.
– అభిలాష అభినవ్, జిల్లా కలెక్టర్, నిర్మల్