ఆదిలాబాద్ జిల్లాను ఆరో రోజైన శనివారం కూడా వర్షం వదలలేదు. వాన దంచికొట్టడంతో సగటు వర్షపాతం 100 మిల్లీమీటర్లుగా నమోదైంది. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండగా.. చెరువులు మత్తడి దుంకుతున్నాయి. పలు కాలనీలు, ఇండ్లలోకి వరద చేరగా.. కొన్ని ఇండ్లు కూలిపోయాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద చేరుతుండడంతో అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువనకు వదులుతున్నారు. ఆదిలాబాద్ బల్దియాలోని బంగారుగూడ వాగులో గుర్తు తెలియని మృతదేహం కొట్టుకురాగా.. పోలీసులు వివరా లు సేకరిస్తున్నారు. పెన్‌గంగ నది ఉగ్రరూపం దాల్చింది. భీంపూర్ మండలం వడూర్ వద్ద పెన్‌గంగ నదిలో చిక్కుకున్న ముగ్గురిని గంగపుత్రులు ఒడ్డుకు చేర్చారు. నిర్మల్ జిల్లాలో కూడా ఉదయం వరకు వర్షం కురిసింది. కడెం, గడ్డెన్న ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వరద దిగువనకు వెళ్తున్నది.
– ఆదిలాబాద్, జూలై 22(నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, జూలై 22(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో వర్షం ప్రభావం కొనసాగింది. శనివారం 100 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కాగా అధికంగా ఆదిలాబాద్ రూరల్ మండలంలో 133 మిల్లీమీటర్ల వర్షం పడింది. మావలలో 12, నేరడిగొండ, భీంపూర్ మండలాల్లో 11, బజార్హత్నూర్లో 10.8, బోథ్‌లో 10.6, గాదిగూడలో 10, గుడిహత్నూర్‌లో 9.8, బేల, ఇచ్చోడ 9.3, తాంసిలో 9.1, ఉట్నూర్‌లో 8.6, సిరికొండలో 8.3, తలమడుగులో 6.7, జైనథ్‌లో 6.3 మిల్లీమీటర్ల వర్షం పడింది. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండగా.. చెరువులు మత్తడి దుంకుతున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో తాంసి మండలంలోని మత్తడివాగు ప్రాజెక్టులోకి 16,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా.. అధికారులు మూడు గేట్లు ఎత్తి 15,500 క్యూసెక్కుల నీటిని దిగువనకు వదులుతున్నారు. సాత్నాల ప్రాజెక్టుకు 2,300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా నాలుగు గేట్ల ద్వారా 2,300 క్యూసెక్కుల నీటిని అధికారులు బయటకు వదిలారు.
పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు
ఆదిలాబాద్ సమీపంలోని బంగారుగూడ వాగులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చింది. పట్టణంలోని జీఎస్, ఖానాపూర్, కుమ్మరికుంట కాలనీల్లో పలు ఇండ్లలోకి నీరు చేరింది. కుంటాల, పొచ్చెర, కనకాయి జలపాతాలకు వరద పోటెత్తింది. భీంపూర్ మండలంలోని వడూర్ వద్ద పెన్‌గంగ ప్రవాహంలో చిక్కుకున్న ముగ్గురిని గంగపుత్రులు ఒడ్డుకు చేర్చారు. ఇంద్రవెల్లి మండలం మూత్నూర్ త్రివేణి సంఘం ప్రాజెక్టు మత్తడి నుంచి భారీగా నీరు ప్రవహిస్తోంది. ఆదిలాబాద్-నాగ్‌పూర్ రహదారిపై పెన్‌గంగ ప్రవాహం బాగా పెరిగింది. జైనథ్ మండలం అనందాపూర్ వద్ద పెన్‌గంగ వంతెన పై నుంచి ప్రవహించగా.. మహారాష్ట్ర ధిగ్రాస్ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాల్లో పంటల్లోకి వరద నీరు చేరడంతో నష్టం వాటిల్లింది.
వర్షం పరిస్థితులపై సమీక్ష
భారీ వర్షాల నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, ఇండ్లు, పొలాల్లోని నీరు చేరకుండా చూడాలని ఆదేశించారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి భోజనం, ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు. అధికారులు సెలవుల్లోకి వెళ్లకుండా క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. సహాయక చర్యల కోసం కలెక్టర్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నంబరు 18004251939 ఏర్పాటు చేశారు.
నిర్మల్ జిల్లాలో..
నిర్మల్ జిల్లాలో శనివారం 61.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కడెం మండలంలోని పెద్దూర్లో 250.6, అత్యల్పంగా నర్సాపూర్‌లో 15.80 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. కడెం ప్రాజెక్టుకు 14 వరద గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శనివారం కూడా గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు నీటిమట్టం 700 అడుగులు(7.603టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 688.025 అడుగులు(4.869 టీఎంసీల) వద్ద ఉంది. శనివారం ఎగువ ప్రాంతాల నుంచి 80 వేల క్యూసెక్కుల వరద నీరు రావడంతో అధికారులు 81 వేల క్యూసెక్కుల నీటిని 14 గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు.
ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టే వరకు నీటి విడుదల కొనసాగించి, మిగిలిన నాలుగు వరద గేట్ల మరమ్మతు పనులు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భైంసా పట్టణంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు ఒక గేటును ఎత్తారు. ఇన్‌ఫ్లో 5,200 క్యూసెక్కులు కాగా.. అవుట్ ఫ్లో 7,100 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేశారు. ఖానాపూర్ మండలంలోని చందునాయక్‌తండా పల్కేరు వాగు ఉప్పొంగి ప్రవాహిస్తోంది. పత్తి పంట నీట మునిగింది. దస్తురాబాద్ మండలంలోని మాల్లాపూర్ గొండు గూడెం, పెద్దమ్మ, కలమడుగు వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పత్తి పంట, వరి నారు మడులు నీట మునిగాయి. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువులు, గొర్ల కాపరులు నది తీరానికి వెళ్ల వద్దని స్థానిక ఎమ్మెల్యే రేఖానాయక్, నీటి పారుదల శాఖ అధికారి ఏఈఈ ఉదయ్‌లు హెచ్చరికలు జారీ చేశారు.