మంచిర్యాల, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : చెన్నూర్ నియోజకవర్గంలో “ఖద్దరు బట్టలు.. కరెన్సీ నోట్లు” ఉన్న వారికే రాష్ట్ర మంత్రి వివేక్ వెంటకస్వామి విలువ ఇస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంస్థ అయిన ఎన్ఎస్యూఐ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు నియోజకవర్గ ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు సంజయ్ కొంత మంది నాయకులతో కలిసి మంత్రి వివేక్ వెంటకస్వామిపై మాట్లాడిన వీడియో మంగళవారం స్థానిక సోషల్ మీడియా గ్రూపుల్లో వైరల్ అయింది.
ఇటీవల చెన్నూర్‌లోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో మంత్రి వివేక్ గ్రంథాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారని, ఆ కార్యక్రమంలో పాల్గొన్న తమను మంత్రి గన్మెన్లు, మంత్రి పీఏలు నెట్టివేశారని, కనీసం తమను పట్టించుకోలేదని ఆరోపించారు.
ఇంకోసారి ఇలా జరిగితే రాజీనామా చేస్తామని పేర్కొన్నారు. మీరు మంత్రిగా కూర్చున్న కుర్చీలో మా చెమట చుక్కలున్నాయని, తమకు సముచిత స్థానాలు కల్పిస్తారని ఎంతో కష్టపడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు విలువ లేకుండా చూస్తున్నారని, మీకోసం, మీ తనయుడు వంశీ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డామన్నారు. ఇప్పటికైనా పట్టించుకోవాలని కోరారు.