కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : ఐటీడీఏ ఆశ్రమాలు, వసతి గృహాల విద్యార్థులకు చన్నీటి స్నానాలు తప్పడం లేదు. ఆయాచోట్ల రూ. 3 కోట్లతో ఏర్పాటు చేసిన సోలార్ హీటర్లు పనిచేయకపోవడంతో చేతి పంపులు, ట్యాంకులను ఆశ్రయిస్తూ అవస్థలు పడుతున్నారు. రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతుండగా, సకాలంలో తరగతులకు హాజరుకావాలనే ఉద్దేశంతో ఉదయం గడ్డకట్టుకుపోయే చలిలో స్నానాలు చేస్తూ అనారోగ్యం బారిన పడుతున్నారు.
ఐటీడీఏ పరిధిలో 104 గిరిజన ఆశ్రమ పాఠశాలలు, కస్తూర్బా విద్యాలయాలు ఉన్నాయి. విద్యార్థులు చలికాలంలో ఇబ్బందులు పడవద్దనే ఉద్దేశంతో విద్యాలయాల్లో ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్(ఐఏపీ) నిధులతో సోలీర్ ఆయాచోట్ల ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్ (ఐఏపీ) నిధులతో సోలార్ వాటర్ హీటర్లను ఏర్పాటు చేశారు. ఎలాంటి టెండర్లు లేకుండానే ఓ సంస్థకు ఆశ్రమాల్లో సోలార్ హీటర్లు ఏర్పాటు చేసే బాధ్యతను అప్పగించారు. ఒక్కోచోట రూ. 3 లక్షలతో సోలార్ హీటర్ ఏర్పాటు చేశారు.
అయితే నాసిరకమైన హీటర్లను ఏర్పాటు చేయడం వల్ల అవి ఒక్క రోజు కూడా పనిచేయలేదన్న ఆరోపణలున్నాయి. సోలార్ వాటర్ హీటర్ల నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. ఇంజినీరింగ్ అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయా చోట్ల చదువుతున్న విద్యార్థులు చేతి పంపుల వద్ద, నీటి ట్యాంకుల వద్ద చల్లని నీళ్లతో స్నానాలు చేస్తూ అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇకనైనా సోలార్ హీటర్లను బాగు చేయించాలని తమ ఇబ్బందులు దూరం చేయాలని వారు కోరుతున్నారు.