మంచిర్యాల, ఏప్రిల్ 15(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డీలిమిటేషన్ బిల్లును నేడు(గురువారం) పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. నియోజకవర్గాల పునర్విభజనతో దేశంలో 545 ఉన్న లోక్సభ స్థానాలు 850కి విస్తరించనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ర్టాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునరిభజన జరగనున్నది. ఇప్పటికే పార్లమెంట్ సభ్యులకు ఇందుకు సంబంధించిన బిల్లు ప్రతులు అందజేశారు. కాకపోతే ముందు నుంచి అనుకుంటున్నట్లు ప్రస్తుతం ఉన్న సీట్లకు 50 శాతం సీట్లు అదనంగా పెంచుతారన్న ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. 2011 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ ఉంటుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179 అవుతాయని చెప్తున్నారు. ఆ లెక్కన 50 శాతం పెరిగినా.. జనాభా ప్రాతిపాదికన అసెంబ్లీ నియోజకవర్గాలు పునర్విభజిస్తే జిల్లాలోని జనాభాను అనుసరించి పునర్విభజన జరుగుతుంది. ఈ లెక్కన ఇప్పటికే పది అసెంబ్లీ స్థానాలు ఉన్న ఉమ్మడి జిల్లాలో మరో ఐదు పెరగవు. సరపడా జనాభా ఉంటేనే పెంపు ఉంటుంది. లేకపోతే ఉండదు. ఇక మహిళలు 33 శాతం రిజర్వేషన్ బిల్లును ఆమోదించనున్నారు. దీంతో పెరిగే స్థానాల్లో వచ్చే ఎన్నికల్లో 33 శాతం మహిళలకు రిజర్వ్ అవుతాయి. జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాల్లో మార్పులు ఉండొచ్చు. ప్రస్తుతం ఎస్సీ ఉన్న నియోజకవర్గాల్లో పునర్విభజన జరిగి కొత్త నియోజకవర్గాలు ఏర్పడితే ప్రస్తుతం ఉన్న నియోజకవర్గంలో రిజర్వేషన్ మారే అవకాశాలున్నాయి. దీంతో అసెంబ్లీ స్థానాల పెంపు ఎలా ఉంటుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
నియోజకవర్గాల పునర్విభజనలో అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దుల ఆధారంగా లోక్సభ స్థానాలను పునర్విభజించాలన్న నిబంధన పెట్టారు. ఈ లెక్కన ముందు అసెంబ్లీ నియోజకవర్గాలను ఏర్పాటు చేస్తారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా చేస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 27,41,239 మంది జనాభా ఉన్నారు. ప్రాథమికంగా అందుతున్న సమాచారం, జరుగుతున్న ప్రచారం మేరకు ప్రతి 5.83 లక్షల జనాభాకు ఒక సీటు పెరిగే అవకాశం ఉంది. ఈ లెక్కన ఆదిలాబాద్ జిల్లాలో 2011 లెక్కలను అనుసంచి 4 నుంచి ఐదు స్థానాలు పెరుగుతున్నాయి. 4 స్థానాలైతే కచ్చితంగా పెంపు ఉండనుంది. అదే 50 శాతం ప్రాతిపాదికన చేస్తే కచ్చితంగా ఐదు సీట్లు పెంచాల్సి వచ్చేది. ఇప్పుడు ఒకటీ అటూ, ఇటూ అయ్యే అవకాశాలున్నాయి. ఇక లోక్సభ స్థానాలు 17 నుంచి 26 లేదా 27 అయ్యే అవకాశాలున్నాయి. జనాభా లెక్కల ఆధారంగా ఏర్పాటు చేస్తే అత్యధిక జనాభా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలోనే ఎక్కువ ఎంపీ సీట్లు పెరుగుతాయి. గ్రెటర్ హైదరాబాద్ చుట్టు పక్కలే దాదాపు 4 లోక్సభ స్థానాలు రావచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్-నిజామాబాద్- కరీంనగర్ జిల్లాల్లో కేవలం ఒకటి లేదా రెండు ఎంపీ సీట్లు రావచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికీ ఒకే ఎంపీ సీటు ఉంది. మంచిర్యాల జిల్లా పెద్దపల్లి ఎంపీ పరిధిలో ఉంది. ఈ నేపథ్యంలో మంచిర్యాల కేంద్రంగా పునర్విభజనలో కొత్త ఎంపీ సీటు ఏర్పాటు కావచ్చు అనుకున్నారు. కానీ.. మూడు ఉమ్మడి జిల్లాలు కలుపుకొని ఇప్పుడు ఒకటీ లేదా రెండు ఎంపీలే అదనంగా వస్తాయంటుండడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎంపీ సీట్ల పెంపుపై స్పష్టత కరువైంది.
డీలిమిటేషన్ను కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్న నేపథ్యంలో మహిళలు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ బిల్లు రానున్నది. దీంతో అటు లోక్సభ స్థానాలతోపాటు ఇటు అసెంబ్లీలోనూ మహిళల ప్రాతినిధ్యం పెరగనున్నది. జనాభా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ రిజ ర్వ్ సీట్లను డిసైట్ చేయనున్నారు. మహిళ రిజర్వ్ స్థానాల విషయంలో రొటేషన్ పద్ధతిలో మార్పులుంటాయని చెప్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం 10 అసెంబ్లీ స్థానాలు, పునర్విభజన అనంతరం 14 లేదా 15 అయ్యే అకాశాలున్నాయి. వీటిలో 33 శాతం కనిష్ఠంగా 4 నుంచి గరిష్ఠంగా 5 స్థానాలు మహిళలకు కేటాయిస్తారు. ఎస్సీ, ఎస్టీ స్థానాలను కలుపుకొనే మహిళల రిజర్వేషన్ కల్పిస్తారు. అంటే రిజర్వేషన్ పురుషులు, మహిళలు అని మారుతూ ఉంటుంది. దీంతో రాజకీయంగా కొత్త వారికి అవకాశాలు వస్తాయి. పురుషులతోపాటు మహిళలు అవకాశాలు అందిపుచ్చుకొనే వీలు ఉండనున్నది.
