నార్నూర్, డిసెంబర్ 26 : అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది మారుమూల గ్రామాల పరిస్థితి. నార్నూర్, గాదిగూడ మండలాల్లోని మారుమూల గ్రామాల ప్రజలకు పల్లెవెలుగు బస్సు సేవలు అందడం లేదు. మండలాల పరిధిలోని మారుమూల గ్రామాలకు రహదారి సౌకర్యం ఉన్నా ఆర్టీసీ అధికారులు బస్సులు నడపకపోవడంతో ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో కళాశాలలు, పాఠశాలలకు సమయానికి రాలేక, ఆర్థికంగా నష్టపోతూ విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. దీంతో ప్రజలు, విద్యార్థులు ఆటోలలో వ్యయ, ప్రయాసల కోర్చి ప్రయాణం చేస్తూ ఇబ్బంది పడుతున్నారు. బస్సులు నడపాలని అధికారులకు ఎన్నో సార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని గిరిజన ప్రజలు, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నార్నూర్, గాదిగూడ మండలాల పరిధిలోని మలంగి, నాగల్కొండ, సోనాపూర్, ఎంపల్లి, సుంగపూర్, ఖండోరాంపూర్, ఆదిమ్యాన్, మేడిగూడ, పర్సువాడ, లోకారి(బీ) గ్రామాలకు బీటీ రోడ్డు సౌకర్యం ఉన్నా పల్లెవెలుగు బస్సు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రహదారిపై బస్సులు నడపడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రహదారిపై బస్సులు నడిపితే మం డల కేంద్రాలకు గిరిజన ప్రజలకు ప్రయాణం సులువు అవుతోంది. కాని బస్సు లేదు.
విద్యార్థులు, మహిళలు అవస్థలు…
పలు గ్రామాలకు పల్లెవెలుగు బస్సు సౌకర్యం లేక పోవడంతో విద్యార్థులు, మహిళలు అష్టకష్టాలు పడుతున్నారు. మారుమూల గిరిజన గ్రామాల విద్యార్థులు ఆటోలలో ప్రయాణిస్తూ ఆర్థికంగా నష్టపోతూ సకాలంలో పాఠశాలలకు, కళాశాలలకు చేరలేక చదువులోను వెనుకబడుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మహిళలకు అందకుండా పోతోంది.
బస్సులు నడపాలి..
తాడిహత్నూర్ నుంచి ఇయిలాస్నగర్ వరకు బస్సు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బస్సు సౌకర్యం కల్పించాలని అధికారులకు విన్నవిస్తూనే ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి మారుమూల గ్రామాలకు బస్సులు నడపాలి. -జాదవ్ సునీత, సర్పంచ్, నాగల్కొండ గ్రామం
బస్సులు నడిపితే ప్రయాణం సులువు..
మండల కేంద్రం నుంచి మాంజ్రి వెళ్లాలంటే ఆటోలలో ప్రయాణిస్తూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మీ పథకం ద్వారా ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. బస్సులు నడిపితే గిరిజనులకు ఆర్థిక భారం తగ్గుతుంది.
-ఆత్రం మహేశ్వరి, సర్పంచ్, రాంపూర్ గ్రామం