హైదరాబాద్ : నిర్మల్ జిల్లా దిలావర్పూర్ (Dilawarpur) మండలంలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును రద్దు చేయాలని కోరుతూ చేపట్టిన మహాధర్నా ఉద్రిక్త పరిస్థితులకు(Tension) దారి తీసింది. రెండురోజులుగా మండలంలో రైతులు మహాధర్నాకు (Mahadarna) పిలుపునివ్వగా పోలీసులు కొంత మంది రైతు ప్రతినిధులను అరెస్టు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది.
అరెస్టు చేసిన ఆందోళనకారులను విడుదల చేయాలని కోరుతూ బుధవారం రైతులు, మహిళలు పోలీసుస్టేషన్ నుంచి నిర్మల్- భైంసా రహదారి వైపు నిరసన ప్రదర్శన నిర్వహించారు. మహిళలు పురుగుల మందు డబ్బాలతో నిరసన తెలిపారు.
పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఆందోళనకారులు తిరగబడ్డారు. ఒక దశలో పోలీసులపైకి రాళ్లు ( Stones )రువ్వారు. దాదాపుగా రెండు గంటలుగా అక్కడి పరిస్థితులు ఉద్రిక్తత మారాయి. జాతీయ రహదారిపై ఆందోళనకారుల బైఠాయించడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది.
ఇథనాల్ పరిశ్రమ వల్ల తమ వ్యవసాయ భూములు పనికి రాకుండా పోతాయని స్థానికులు వాపోతున్నారు. పరిశ్రమను రద్దు చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్న పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు. ఇన్చార్జి మంత్రి సీతక్క , స్థానిక ఎమ్మెల్యే ఇథనాల్ రద్దు విషయమై వెల్లడించేంత వరకు తమ ఆందోళన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు.