నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 10 : దేశంలో వంటనూనె కొరతను అధిగమించేందుకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ సెంటర్ ప్రోత్సాహం అందిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో ఆయిల్ పామ్ సాగుకు అనువైన ప్రాంతంగా గుర్తించామని ఆ సంస్థ ప్రిన్సిపాల్ సైంటిస్ట్ రాంచంద్రుడు అన్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బీరవెల్లి గ్రామంలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆయిల్ పామ్ నర్సరీని గురువారం శాస్త్రవేత్తల బృందం సభ్యులు సందర్శించారు. మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఉద్యానవన శాఖ కార్యాలయంలో ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వపరంగా తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. జిల్లాలో ఉన్న సారవంతమైన భూములు, నీటి వనరులను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది ఆయిల్ పామ్ సాగు చేసేందుకు కృషి చేస్తునట్లు అధికారులు కేంద్ర బృంద సభ్యులకు వివరించారు. ఆయిల్ పామ్‌కు మార్కెట్లో డిమాండ్ ఉన్న నేపథ్యంలో రైతులు ఈ పంటను సాగు చేస్తే మూడు సంవత్సరాల పాటు రాయితీ రుణాలను అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర బృంద సభ్యులు విజయ్‌కృష్ణ, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రాథోడ్ శ్యాంరావ్, అధికారులు రాంమోహన్, నిర్మల్ జిల్లా ఉద్యానవన శాఖ అధికారి అలీయాఫాతిమా, హర్షవర్ధన్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
రైతులు ఆయిల్‌పామ్ సాగుపై ఆసక్తి కనబరిస్తే లాభాలు గడించవచ్చని జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి శ్యాంరావ్ అన్నారు. మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ గ్రామంలో గల ఆయిల్‌పామ్ డెమో ప్లాంట్‌ను, మల్బరీ నర్సరీని గురువారం ఆయన సందర్శించారు. నర్సరీలో ఆయిల్‌పామ్ తోటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు రైతులకు వివరించారు. కార్యక్రమంలో ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి మౌనిక, టెక్నికల్ అసిస్టెంట్ భిక్యానాయక్ పాల్గొన్నారు.