పెంబి: నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను (Government School) నిర్మాణం పూర్తికాకుండానే ప్రారంభించారు. అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణాన్ని అలాగే గాలికివదిలేశారు. పెంబి మండల కేంద్రంలోని సర్కారు బడి శిథిలావస్థకు చేరుకున్నది. దీంతో రూ.1.20 కోట్లతో నూతన పాఠశాల భవన నిర్మాణం చేపట్టారు. బడి చుట్టూ ప్రహరీ గోడ, కిచెన్ షెడ్డు, డైనింగ్ హాల్, గ్రౌండ్ నిర్మాణం పూర్తికాకా ముందే గతేడాది అక్టోబర్ 29న ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్లు అసంపూర్తి పాఠశాలను ప్రారంభించారు. పాఠశాల అసంపూర్తిగా నిర్మాణం కావడంతో తరగతులు నిర్వహించడం లేదు.
ప్రస్తుతం ప్రహరీ గోడ నిర్మాణం పూర్తి అయినప్పటికీ, కిచెన్ షెడ్డు, డైనింగ్ హాల్, గ్రౌండ్ నిర్మాణం పూర్తికలేదు. అసంపూర్తి పాఠశాలను ప్రారంభించడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాల్లోనే ప్రస్తుతం తరగతులు కొనసాగడంతోపాటు పదో తరగతి పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాలలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు, ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నూతనంగా నిర్మించిన పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.