కుభీర్, డిసెంబర్ 03 : తన ప్రాణ త్యాగంతో తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరి పోసిన అమరుడు శ్రీకాంతా చారి చిరస్మరణీయుడని బీఆర్ఎస్ ముధోల్ నియోజకవర్గ సమన్వయ సమితి సభ్యుడు డాక్టర్ కిరణ్ కొమ్రేవార్ అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శ్రీకాంతాచారి వర్ధంతిని నిర్వహించారు. శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కొమ్రేవార్ మాట్లాడుతూ.. మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంత్ స్వరాష్ట్ర సాధన కోసం అప్పటి కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పట్ల అవలంభిస్తున్న విధానాలకు మనస్థాపానికి గురై తన ప్రాణాలతోనైనా తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుందేమోనని ప్రాణం త్యాగం చేసిన త్యాగధనుడని కీర్తించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరినీ ఉద్యమంలో పాల్గొనేలా చేసి ఉద్యమానికి ఊపిరి పోసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యమ నాయకుడు పుప్పాల పిరాజి, మండల పార్టీ అధ్యక్షుడు ఎన్నిల అనిల్, వైస్ ఎంపీపీ మోహియోద్దీన్, బీఆర్ఎస్ నాయకులు గడ్డం సంజీవ్, బాబు, పోగుల లింగన్న, పోగుల పోతన్న, దొంతుల లింగన్న, బంక మాధు, కె.లక్ష్మణ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.