దస్తూరాబాద్: భక్తుల పాలిట కొంగు బంగారం, కోరిన కోరికలు తీర్చే స్వామిగా గొడిసెర్యాల రాజన్న స్వామి (Rajeshwara Swamy Temple) వెలుగొందుతున్నారు. శివనామస్మరణతో ఆ రాజేశుడిని పూజిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. గోదావరి ఒడ్డున వెలిసిన రాజేశుడు నిత్యం భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. నిర్మల్ (Nirmal) జిల్లా దస్తూరాబాద్ మండలంలోని గొడిసెర్యాలలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం మహా శివరాత్రి కి ముస్తాబైంది. 27 ఏండ్ల క్రితం వెలిసిన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.
విద్యుత్ దీపాల అలంకరణతో ఆలయం వెలిగిపోతున్నది. బుధవారం నుంచి 3 రోజులతోపాటు మహా శివరాత్రి ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఆలయ అర్చకులు సిడం లక్ష్మణ స్వామి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండే కాకుండా చుట్టుపక్క జిల్లాల నుంచి ఆలయానికి భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
మూడు రోజులపాటు ఉత్సవాలు
ఆలయంలో మూడు రోజులపాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మొదటి రోజు శివ పార్వతుల కల్యాణం, జాగరణ, రెండో రోజు మల్లన్న బోనాలు, పోచమ్మ బోనాలు, మూడో రోజు అన్నపూజ, కుంకుమ పూజ, సామూహిక హోమం, తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు లక్ష్మణ స్వామి తెలిపారు.