Belt Shop Business | నిర్మల్ జిల్లా, సారంగాపూర్, జూలై 6: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో బెల్టు దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. లైసెన్సు పొందిన మద్యం దుకాణాల నుంచి నిత్యం గ్రామాలకు మద్యం సరఫరా అవుతున్నా, సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. లైసెన్సు ఆదాయం పెంచుకోవాలనే ఉద్దేశంతో గ్రామాల్లో బెల్టు షాపులు విచ్చలవిడిగా పెరిగిపోయి, మద్యం అమ్మకాలు నిరాటంకంగా సాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
వాహనాల్లో అక్రమ సరఫరా:
మండలంలో మూడు లైసెన్సు కలిగిన మద్యం దుకాణాలు ఉన్నాయి. వాస్తవానికి ఇక్కడ మాత్రమే అమ్మకాలు జరగాలి. కానీ, బెల్టు షాపుల నిర్వాహకులు ద్విచక్ర వాహనాలు, ఆటోల ద్వారా మద్యం సీసాలను గ్రామాలకు తరలిస్తున్నారు. సారంగాపూర్, చించోలి బి, బీరవెల్లి గ్రామాల్లో ఉన్న లైసెన్సు దుకాణాల నుంచే ఈ బెల్టు షాపులకు మద్యం సరఫరా అవుతోంది.
బార్లను తలపిస్తున్న బెల్టు షాపులు:
సారంగాపూర్ మండలంలో మొత్తం 57 గ్రామాలు ఉండగా, వాటిలో 32 గ్రామ పంచాయతీలు, 25 అనుబంధ గ్రామాలు ఉన్నాయి. అయితే, సుమారు 50కి పైగా గ్రామాల్లో బెల్టు దందా కొనసాగుతోంది. వైన్ షాపుల యజమానులు ఇచ్చిన ధైర్యంతో, గ్రామాల్లోని బెల్టు షాపులు “ఆరు క్వార్టర్లు, మూడు బీర్లు” అన్న చందంగా విచ్చలవిడిగా బార్లను తలపించేలా నడుస్తున్నాయని ప్రజలు మండిపడుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ బెల్టు దుకాణాల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. దీనివల్ల గ్రామాల్లో గొడవలు జరుగుతున్న సంఘటనలు కూడా ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వీడీసీల ఆధ్వర్యంలో వేలంపాటలు, అధిక ధరలు:
కొన్ని గ్రామాల్లో వీడీసీల (గ్రామ అభివృద్ధి కమిటీలు) ఆధ్వర్యంలో బెల్టు షాపులకు వేలంపాటలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వేలంపాటలో షాపులు దక్కించుకున్న నిర్వాహకులు వైన్ షాపుల నుంచి మద్యాన్ని తీసుకొచ్చి, ప్రింటెడ్ ధర కంటే క్వార్టర్‌కు రూ.10, ఫుల్ బాటిల్‌కు రూ.40 చొప్పున అధిక ధరలకు విక్రయిస్తూ మద్యం ప్రియుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. మరికొన్ని గ్రామాల్లో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా మద్యాన్ని అధిక ధరలకు అమ్మి అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
అడెల్లి ఆలయం వద్ద కూడా అక్రమ దందా:
మండలంలోని అడెల్లి ఆలయం వద్ద కూడా అక్రమంగా బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు అధిక ధరలకు మద్యం అమ్ముతుండటంతో భక్తులకు నష్టం వాటిల్లుతోందని ఆరోపణలున్నాయి.
ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు: ఎక్సైజ్ అధికారులు బెల్టు షాపుల నిర్వహణ ఇంత పెద్ద మొత్తంలో జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. అధికారులు తక్షణమే స్పందించి బెల్టు షాపులను అరికట్టాలని మండల వాసులు కోరుతున్నారు.