న్యూఢిల్లీ, అక్టోబర్ 1: వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)కు గాను గోధుమలు పప్పుదినుసులకు మద్దతు ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గోధుమలపై మద్దతు ధరను రూ.160 (6.59 శాతం) పెంచింది. దీంతో గోధుమల ధర క్వింటాలుకు రూ.2,425 నుంచి రూ.2,585కు పెరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచార, ప్రసార శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ (సీఏసీపీ) సిఫారసుల మేరకు యాసంగిలో ఆరు పంటల మద్దతు ధరను పెంచినట్టు తెలిపారు. అయితే వరికి మద్దతు ధర పెంచకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
కొత్తగా 57 కేవీలకు మంజూరు
దేశంలో కొత్తగా 57 కేంద్రీయ విద్యాలయాల ప్రారంభానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీటిలో ఏడింటిని కేంద్ర హోం శాఖ స్పాన్సర్ చేయనుండగా, మిగిలిన వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించనున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గణనీయ సంఖ్యలో ఉన్నప్పటికీ కేంద్రీయ విద్యాలయాలు లేని 20 జిల్లాల్లో వాటిని కొత్తగా ప్రారంభించాలని నిర్ణయించారు.
వందేమాతరంకు 150 ఏండ్లు
జాతీయ గేయం ‘వందేమాతరం’ 150 ఏండ్ల వార్షికోత్సవాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. స్వాతంత్య్రోద్యమంలో ఈ గేయం నిర్వహించిన పాత్రను దృష్టిలో ఉంచుకొని ఆ గేయానికి 150 ఏండ్లు అవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది.