ఆదిలాబాద్, సెప్టెంబర్ 30(నమస్తే తెలంగాణ) ః ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా స్థానిక సంస్థల రిజర్వేషన్ల లడాయి జోరందుకున్నది. నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు చెబుతున్న అధికారులు పంచాయతీల పరిధిలోని ఏ ఒక్కరు లేని వర్గాలకు రిజర్వేషన్లు ఎలా కల్పిస్తారంటూ స్థానిక నాయకులు నిలదీస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 20 జడ్పీటీసీలు, 20 ఎంపీపీలు, 168 ఎంపీటీసీలు, 473 గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్లు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఉండగా.. లక్కీ డ్రాలు తీసి వాటిని ఖరారు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో రిజర్వేషన్లు ఆశావహులను తీవ్ర అసంతృప్తికి గురి చేయగా, స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పలు గ్రామ పంచాయతీల్లో అసలు జనాభా లేని వర్గాలకు రిజర్వేషన్లు వచ్చాయి. రిజర్వేషన్ల ప్రకారం ఆయా స్థానాల్లో పోటీ చేసే వారు లేకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొన్నది. జీరో జనాభా ఉన్న వర్గాలకు రిజర్వేషన్లు ప్రకటించడంతో స్థానిక నాయకులు రిజర్వేషన్ల ప్రక్రియను తప్పు పడుతున్నారు. సవరించాలంటూ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని సవర్గాం, పీసర, ఆరెపల్లి గ్రామ పంచాయతీలు బీసీలకు రిజర్వు చేశారు. దీంతో ఆ గ్రామాలకు చెందిన నాయకులు బీసీ జనాభా లేని పంచాయతీల్లో ఎలా రిజర్వు చేస్తారంటూ కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. సవర్గాంలో 505, పీసరలో 425, ఆరెపల్లిలో 377 జనాభా ఉంది. వీటిలో బీసీలు ఒక్కరు లేకున్నా వారికి రిజర్వేషన్లు కల్పించారంటూ వినతిపత్రంలో పేర్కొన్నారు. రిజర్వేషన్లు మార్చి ఎస్టీ లేదా జనరల్‌కు కేటాయించాలని స్థానికులు కోరారు.
ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చిట్యాలబోరి గ్రామ పంచాయతీలో మొత్తం గిరిజన జనాభా ఉండగా, సర్పంచ్ స్థానం బీసీ(మహిళ/పురుషుడు)లకు కేటాయించారంటూ స్థానికులు ప్రజావాణిలో వినతిపత్రం అందించారు. గ్రామ పంచాయతీ జనాభా 485 ఉండగా.. ఇందులో మహిళలు 260 మంది, పురుషులు 225 మంది ఉన్నారు. వీరిలో ఓటర్ల సంఖ్య 305 ఉండగా.. మహిళలు 165 మంది, పురుషులు 140 మంది ఉన్నట్లు స్థానికులు తెలిపారు. మొత్తం జనాభా గిరిజనులేనని, ఇతర వర్గాలకు చెందిన వారు ఎవరూ లేరన్నారు. సర్పంచ్ స్థానం బీసీలకు రిజర్వు కావడంతో పోటీ చేసే అభ్యర్థులు లేరని వారు ఫిర్యాదులో సూచించారు. గ్రామ పంచాయతీలో అందరూ గిరిజనులు ఉండడంతో రిజర్వేషన్ మార్చాలని కోరారు.
మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం రాజారాం గ్రామ పంచాయతీని 2019లో ఎస్సీలకు రిజర్వు చేశారు. ఎస్సీ ఓటర్లు లేకపోవడంతో ఎన్నిక జరగలేదు. ఈసారి కూడా అదే పరిస్థితి నెలకొన్నది.
మంచిర్యాల జిల్లాలోని కల్లంపల్లి పంచాయతీని బీసీలకు రిజర్వు చేశారు. ఇక్కడ బీసీ ఓటర్లు లేరు. దీంతో ఎన్నికలకు దూరమయ్యే పరిస్థితి నెలకొన్నది.
మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని మెట్పల్లి పంచాయతీలో ఆరు వార్డులు ఉండగా.. వీటిని ఎస్సీలకు కేటాయించారు. సర్పంచ్ పదవి మాత్రం బీసీలకు కేటాయించడంతో ఏ ప్రాతిపాదికన కేటాయించారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ రూరల్ మండలం అటవీ సారంగాపూర్ పంచాయతీలో గిరిజనులు ఉండగా బీసీలకు కేటాయించారు. ఆదివాసీ గ్రామాల్లో బీసీలకు రిజర్వేషన్లు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. దస్తురాబాద్ మండం పెర్కపల్లిని ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. ఇక్కడ బీసీ జనాభా అధికంగా ఉండడంతో బీసీలకు కేటాయించాలని ఆందోలనలు చేస్తున్నారు. అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తున్నారు.
వేమనపల్లి, సెప్టెంబర్ 30 : మా గ్రామ పంచాయతీలో మొత్తం 299 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ఎస్సీలు 35 మంది ఓటర్లు ఉన్నారు. ఇక మిగతా వారంతా ఎస్టీలే. ఇక్కడ ఒక్కరు కూడా బీసీ లేరు. కానీ ఇక్కడ సర్పంచ్ ఎన్నికల కోసం బీసీ జనరల్ కేటాయించారు. అది రద్దు చేసి ఎస్టీ రిజర్వేషన్ కేటాయించాలి. 2019లో ఎస్టీ మహిళకు కేటాయిస్తే ఎన్నికలు జరిగాయి. కానీ ఈసారి బీజీ జనరల్ ఎందుకు కేటాయించారో అర్థం కావడం లేదు.
– కుస్రం సత్తయ్య, కల్లంపల్లి
వేమనపల్లి, సెప్టెంబర్ 30 : మా గ్రామ పంచాయతీలో 266 మంది ఓటర్లు ఉన్నారు. 184 మంది ఎస్టీ ఓటర్లు, 76 మంది బీజీ ఓటర్లు, ఆరుగురు ఓసీ ఓటర్లు ఉన్నారు. ఇక్కడ అసలు ఎస్సీలే లేరు. కానీ ఎస్సీ రిజర్వేషన్ కేటాయించారు. ఎస్టీ, బీసీలున్న మా గ్రామ పంచాయతీలో 2019లో ఎస్సీకి కేటాయించారు. అప్పుడు ఎన్నికలు నిలిచిపోయాయి. ఇప్పుడు మళ్లీ ఎస్సీ మహిళకు రిజర్వ్ చేశారు. మళ్ళీ ఎన్నికలకు బ్రేక్ పడనున్నది. ప్రస్తుతం కేటాయించిన రిజర్వేషన్‌ను తొలగించి ఎస్టీ రిజర్వు చేయాలి.
– జింజిరి నగేశ్, రాజారం