న్యూఢిల్లీ, అక్టోబర్ 1: పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కశ్మీరు(పీవోకే)లో కొనసాగుతున్న హింసాత్మక నిరసనలు బుధవారం 8 మంది ప్రాణాలను బలిగొన్నాయి. బాగ్ జిల్లాలోని ధీర్కోట్లో నలుగురు మరణించగా ముజఫరాబాద్‌లో ఇద్దరు, మీర్పూర్లో మరో ఇద్దరు పోలీసు కాల్పులలో మరణించారు. మంగళవారం ముజఫరాబాద్‌లో ఇద్దరు మరణించడంతో మృతుల సంఖ్య పదికి చేరింది. ప్రాథమిక హక్కులను కాలరాస్తున్న షహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పీవోకేలో గడచిన మూడు రోజులుగా ఆవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో ప్రజా నిరసనలు జరుగుతున్నాయి. మార్కెట్లు, దుకాణాలు, స్థానిక వ్యాపారాలు పూర్తిగా మూతపడగా రవాణా సేవలు స్తంభించిపోయాయి. ముజఫరాబాద్‌కు ఊరేగింపుగా వెళుతున్న నిరసనకారులను అడ్డుకునేందుకు ప్రభుత్వం భారీ కంటెయినర్లను వంతెనపై అడ్డం పెట్టగా నిరసనకారులు వాటిని కింద నదిలోకి తోసివేశారు.
వందలాదిమంది నిరసనకారులు కంటెయినర్లను వంతెనపై నుంచి నదిలోకి తోసివేస్తున్న దృశ్యాల వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. పాక్‌లో నివసిస్తున్న కశ్మీరీ శరణార్థులకు పీఓకే అసెంబ్లీలో రిజర్వ్ చేసిన 12 సీట్లను రద్దు చేయడంతోసహా మొత్తం 38 డిమాండ్లను ఆవామీ యాక్షన్ కమిటీ పాక్ ప్రభుత్వం ముందు ఉంచింది. గడచిన 70 ఏళ్లుగా తమ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, ప్రభుత్వం తమకు హక్కులను కల్పించాలని లేదా ప్రజల ప్రతిఘటన ఎదుర్కోవాలని కమిటీ నాయకుడు షౌకత్ నవాజ్ మీర్ తెలిపారు. ప్రజలు చేస్తున్న ఈ సమ్మె ప్లాన్ ఏ మాత్రమేనని, ప్రభుత్వానికి ఇవి నోటీసులు మాత్రమేనని ఆయన చెప్పారు. ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే ప్లాన్ డీ కూడా ఉందని ఆయన హెచ్చరించారు. అయితే పీవోకే పౌరుల నిరసనలను ప్రభుత్వం పోలీసు బలగాలతో అణచివేసే చర్యలు చేపట్టింది. భారీ స్థాయిలో పోలీసు, భద్రతా బలగాలు ముజఫరాబాద్ చేరుకున్నాయి. పీవోకేలో ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది.
సొంత ప్రజలపై పాక్ డ్రోన్ దాడులు..
పాకిస్థాన్ సైన్యం సొంత ప్రజలపై దాడులు చేస్తున్నది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ, బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ల ఆధీనంలో ఉన్న జెహ్రీ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం కోసం జనరల్ అసీం మునీర్ నేతృత్వంలోని సైన్యం విచక్షణారహితంగా దాడులు చేస్తున్నది. శతఘ్నులు, మోర్టార్లతో విరుచుకుపడుతున్నది. దీంతో జెహ్రీ ప్రాంతంలోని ప్రజలు భయాందోళనలతో వణికిపోతున్నారు. నాలుగు రోజులుగా డ్రోన్లతో జరుగుతున్న దాడుల వల్ల ప్రజలు అష్టదిగ్బంధనంలో గడుపుతున్నారు. ఆహారం, ఇంధనం కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. బాంబులు పత్తి పొలాలను ధ్వంసం చేస్తున్నాయి.