హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ కోర్టులో రెండో రోజు విచారణ కొనసాగింది. మొత్తం పదిమంది ఫిరాయింపు ఎమ్మెల్యేలలో బుధవారం నలుగురు స్పీకర్ ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫు న్యాయవాదులు అడిగిన ప్రశ్నలకు వారు తడబడినట్టు తెలిసింది. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ మహాసభలకు తాము హాజరు కాలేదని స్పీకర్ కోర్టుకు వారు వెల్లడించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. పార్టీ నుంచి తమకు సమాచారం లేకపోవడం వల్లే సభకు వెళ్లలేకపోయామని వివరించినట్టు సమాచారం. అలాగే, అసెంబ్లీలో తాము ప్రత్యేకంగా ఒక చోట కూర్చోవడం లేదని, ఎక్కడ వీలుంటే అక్కడ కూర్చుంటున్నామని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పినట్టు తెలిసింది.
ఫిరాయింపు ఎమ్మెల్యేల తరఫు న్యాయవాదులు సోమవారం ఫిర్యాదుదారులైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను విచారించారు. ప్రతిగా బుధవారం ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఫిర్యాదుదారుల తరఫు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామిన్ చేశారు. నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలు విచారణకు హాజరైనప్పటికీ ఇద్దరి విచారణ మాత్రమే పూర్తయినట్టు తెలిసింది. ఉదయం 11 గంటలకు మొదలైన విచారణ సాయంత్రం ఆరున్నర గంటల వరకు కొనసాగింది. కాలె యాదయ్య, ప్రకాష్‌గౌడ్ క్రాస్ ఎగ్జామిన్కే సమయం మించిపోవడంతో మరో ఇద్దరి ఎమ్మెల్యేల విచారణను 4వ తేదీకి వాయిదా వేసినట్టు తెలిసింది.
పాడిందే పాడి..
క్రాస్ ఎగ్జామిన్‌లో ఫిరాయింపుదారులు పాత పల్లవే అందుకున్నట్టు తెలిసింది. మీరు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారన్న ప్రశ్నకు బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పినట్టు సమాచారం. బీఆర్ఎస్లోనే ఉంటే మరి ఎల్కతుర్తి సభకు వెళ్లారా? వెళ్లినట్టయితే ఆధారాలు చూపించాలన్న న్యా యవాదుల ప్రశ్నకు, తమకు సమాచారం లేకపోవడం వల్లే ఎల్కతుర్తి సభకు వెళ్లలేకపోయామని చెప్పినట్టు తెలిసింది. ఎలాంటి సమాచారం ఇస్తే వెళ్లేవారన్న ప్రశ్నకు వారి నుంచి సమాధానం రాలేదని తెలిసింది. ఏడాదిన్నర కాలంలో బీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశాలకు ఎన్నిసార్లు వెళ్లారని న్యాయవాదులు ప్రశ్నించగా, ఒక్కసారి కూడా వెళ్లలేదని, బీఆర్ఎస్ వాళ్లు తమను పిలవలేదని, అందుకే వెళ్లలేదని చెప్పినట్టు తెలిసింది.
జిల్లాలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సభలకు, సమావేశాలకు మీరు వెళ్లినట్టున్నారు? అది మీ పార్టీ కాదు కదా? మరి ఎందుకు వెళ్లినట్టు? అని న్యాయవాదులు అడిగిన ప్రశ్నకు జిల్లా కాబట్టి ఎమ్మెల్యేలకు ప్రొటోకాల్ ఉంటుందని, అందుకే వెళ్లామని చెప్పినట్టు సమాచారం. ప్రొటోకాల్ అంటే ఏమిటి? అని న్యాయవాదులు అడిగిన ప్రశ్నకు ఎమ్మెల్యేల నుంచి సమాధానం రాలేదు. మీరు ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరినట్టు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం అయింది. మీ చేరిక నిజమే కదా? అని ఎమ్మెల్యే కాలె యాదయ్యను అడిగిన ప్రశ్నకు, తాను ఢిల్లీ వెళ్లినప్పుడు కాంగ్రెస్ పెద్దలు తన చుట్టూ నిలబడ్డారని సమాధానం చెప్పినట్టు తెలిసింది. ఇటువంటి పనులతో మీ మీద అనర్హత వేటు పడుతుందని మీకు తెలుసా ? అని అడిగిన ప్రశ్నకు ఫిరాయింపుదారులు తెలియదు అని చెప్పినట్టు సమాచారం.
4న బండ్ల, మహిపాల్‌రెడ్డి విచారణ
బుధవారం కాలె యాదయ్య, ప్రకాష్గౌడ్కే సమయం సరిపోవడంతో 4న బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డిల క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫున న్యాయవాదులు గండ్ర మోహన్‌రావు, సంతోష్‌కుమార్‌లు ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయగా, మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రాంచందర్‌రావు, ఎల్ వెంకటేశ్వర్రావు కలిసి కాలె యాదయ్యను విచారించినట్టు తెలిసింది. కాలె యాదయ్యను 90 ప్రశ్నలు, ప్రకాశ్‌గౌడ్‌ను 50 ప్రశ్నలు అడిగి సమాధానం రాబట్టినట్టు తెలిసింది. వారి సమాధానాలతో ఫిరాయింపుదారులు డిస్క్వాలిఫై అవుతారనే అంచనాకు వచ్చినట్టు తెలిసింది.