నిర్మల్ టౌన్, జనవరి 27 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ అభయారణ్యం టైగర్ జోన్ ప్రాంతంలోకి యూరప్ నుంచి వలస పక్షులు వచ్చినట్లు ఖానాపూర్ ఎఫ్‌డీవో కోటేశ్వర్రావు తెలిపారు. కవ్వాల్ టైగర్ రిజర్వులోని కలపకుంట, ఆకొండపేట చెరువులో నార్తన్ పిన్ టైల్ బాతు జాతికి చెందిన పక్షులు వారం రోజుల క్రితం ఇక్కడికి చేరుకొని విహారిస్తున్నట్లు వివరించారు. ఈ జాతి పక్షులు రాష్ట్రంలోని హైదరాబాద్, మంజీరా, ఉస్మాన్‌సాగర్ తదితర ప్రాంతాలకు మాత్రమే రాగా.. ఈసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ జోన్‌లోని చెరువుల్లోకి వచ్చినట్లు తెలిపారు. రెండు నెలల పాటు ఇక్కడే ఉండి యూరప్ దేశాలకు వెళ్లి అక్కడ సంతానోత్పత్తి చేసుకొని తిరిగి ఈ ప్రాంతానికి ఈ జాతి పక్షులు ఎక్కువగా వస్తాయని పేర్కొన్నారు. వీటిలో ఆడ, మగ పక్షులున్నాయన్నారు. వీటి ప్రయాణం సుమారు 8,300 కిలోమీటర్లు ఉంటుందని వివరించారు.