నిర్మల్ అర్బన్, నవంబర్ 21 : ప్రజా సంక్షేమ మే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యా య, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం కావడంతో శరవేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా దశల వారీగా అభివృద్ధి పనులను చేపడుతున్నామని పేర్కొన్నారు. రూ.28 కోట్ల వ్యయంతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి అల్లోల సోమవారం భూమి పూజ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి నిర్మల్ పట్టణంతో పాటు చుట్టు పక్కల కూడా రహదారుల నిర్మాణం, విస్తరణ పనులు చేపడుతున్నామని తెలిపారు. క్రషర్ రోడ్డు నుంచి ఇంటి గ్రేటెడ్ కలెక్టరేట్ మీదుగా బంగల్పేట్ వరకు నాలుగు వరుసలుగా ఈ రహదారిని విస్తరిస్తున్నామని వెల్లడించారు. రహదారి నిర్మాణం పూర్తయితే వస్తే ట్రాఫిక్ సమస్యలు దూరమవుతాయని, నాలుగు వైపుల నుంచి కలెక్టరేట్‌కు చేరుకునే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఆర్డీవో స్రవంతి, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, ఎఫ్ఏస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, కౌన్సిలర్లు లక్కాకుల నరహరి, నాయకులు కొండ శ్రీధర్, నర్సయ్య, రిజ్వాన్, సయ్యద్ ముషీరొద్దీన్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
అయ్యప్ప ఆలయంలో మంత్రి పూజలు
నిర్మల్‌లోని అయ్యప్ప ఆలయాన్ని మంత్రి అల్లోల దర్శించారు. ఆలయానికి వచ్చిన మంత్రికి వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 2023 క్యాలెండర్‌ను విడుదల చేశారు. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ఆలయా న్ని దర్శించుకున్నట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు అల్లోల మురళీధర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, లక్ష్మీనారాయణ, గురుస్వామి నవయుగ మూర్తి, వేణుగోపాల్ రెడ్డి, పద్మనాభం, రవి, దేవర రఘు ఉన్నారు.
ప్రతి ఇంటికీ భగీరథ నీరందించాలి
నిర్మల్ జిల్లాలోని ప్రతి ఇంటీకి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశించారు. నిర్మల్ కలెక్టరేట్లో ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, రేఖానాయక్, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీతో కలిసి సోమవారం మిషన్ భగీరథపై జిల్లా ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. జిల్లాలో భైంసా, మాడేగాం, కడెం ద్వారా 396 పంచాయతీలకు మిషన్ భగీరథ ద్వారా శుద్ధ జలం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికి శుద్ధ జలం అందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు మిషన్ భగీరథ ద్వారా మంజూరైన నిధులు, పూర్తయిన పనులు, ఆవాసాలకు నీటి సరఫరా, నీటి ట్యాంకులు, సిబ్బంది పనితీరు, ఇంటర్నల్ పైపులైన్, లికేజీల నియంత్రణ, తదితర అంశాలపై మండలాల సమీక్ష నిర్వహించారు. చాలా గ్రామాల్లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా పైపులైన్లు భూమిలోపల వేయకపోవడంతో తరచూ లికేజీలు ఏర్పడుతున్నాయని గుర్తు చేశారు. స్థిరీకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతిరోజు గ్రామాలను సందర్శించి నీళ్లు అందని ప్రదేశాలను గుర్తించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, మిషన్ భగీరథ ఎస్ఈ వెంకటేశ్వర్రావు, సిబ్బంది ఉన్నారు.