నిర్మల్ టౌన్, అక్టోబర్ 30 : వరి పండించిన రైతాంగానికి ప్రభుత్వం అండగా నిలువనున్నది. ఇప్పటికే వానకాలం సీజన్లో రైతులు సాగు చేసిన వరి పంట కోత కోసి ధాన్యం ఆరబెడుతున్నారు. దీంతో నవంబర్ మొదటి వారంలోనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేలా జిల్లా అధికారులు కసరత్తు పూర్తి చేశారు. ఈ సారి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వర్షాలు సమృద్ధిగా కురవడంతో సాగునీటి వనరులు, బోర్ల కింద వరి సాగు చేసిన రైతులకు నీటి కొరత ఏర్పడ లేదు. దీంతో దిగుబడులు కూడా ఆశాజనకంగానే ఉండడంతో ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు లేకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1,12,500 ఎకరాల్లో వరి సాగైనట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందుకోసం 464 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 4.85 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసిన అధికారులు.. అందుకు అవసరమైన కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై కసరత్తు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లాలోని ఆయా కలెక్టర్ కార్యాలయాల్లో అదనపు కలెక్టర్ల సమక్షంలో వరి ధాన్యం కొనుగోళ్లపై పౌర సరఫరాలశాఖ, మార్కెటింగ్, సహకార, డీఆర్డీఏ, గిరిజన సొసైటీ అధికారులతో జిల్లా సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకొని ప్రత్యేక దృష్టి పెట్టారు. గతేడాది కేంద్ర ప్రభుత్వం యాసంగిలో వరి ధాన్యం కొనుగోళ్లపై ఆంక్షలు విధించగా.. ప్రభుత్వమే ముందుకొచ్చి కొనుగోళ్లు చేపట్టి రైతులకు మేలు చేసింది. ఈసారి కూడా వానకాలంలో ఎంత ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చినా మొత్తం ప్రభుత్వమే సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది.
ఉమ్మడి జిల్లాలో 4.85లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యం..
ఈ ఏడాది వానకాలం సీజన్లో వరి పండించిన రైతాంగం ద్వారా 4.85లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నిర్మల్ జిల్లాలో 40వేల ఎకరాల్లో వరి సాగు చేయగా.. 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రానున్నదని అధికారులు అంచనా వేశారు. మంచిర్యాలలో 65వేల ఎకరాల్లో 2.45 లక్షల మెట్రిక్ టన్నులు, ఆదిలాబాద్‌లో 1500 ఎకరాల్లో 3500 మెట్రిక్ టన్నులు, ఆసిఫాబాద్‌లో 6వేల ఎకరాల్లో 10వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రానున్నదని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం నిర్మల్‌లో 182, మంచిర్యాలలో 242, ఆదిలాబాద్‌లో 5, ఆసిఫాబాద్‌లో 35 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో పీఏసీఎస్, డీసీఎంఎస్, ఐకేపీ, గిరిజన కో ఆపరేటివ్ సొసైటీ, పౌర సరఫరాలశాఖ తదితర కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నది. ప్రభుత్వం వరికి ఏ గ్రేడ్ రకానికి రూ.2060, బీ గ్రేడ్‌కు రూ.2040 మద్దతు ధర ప్రకటించగా, ఆ ధర ప్రకారమే కొనుగోలు చేయాలని ప్రభుత్వం జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ మొదటి వారంలో రైతులు వరి కోతలు కోయనుండడంతో అదే వారంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు అవసరమైన కాంటా, గన్నీ బ్యాగులు, తేమశాతం మిషన్లు అందుబాటులో ఉంచారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటవెంటనే రైస్‌మిల్లులకు తరలించేందుకు లారీల టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేశారు. రూట్ల వారీగా ధాన్యం తరలించే కార్యాచరణను రూపొందించినట్లు జిల్లా అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే ఆయా గోదాం, రైస్‌మిల్లర్లతో పెద్దఎత్తున బియ్యం నిల్వలు ఉండడంతో వాటిని వేరే ప్రాంతాలకు తరలించి కొత్త ధాన్యం రైస్‌మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకుంటున్నారు. ధాన్యం కొనుగోళ్లు పూర్తయిన వెంటనే ట్యాబ్‌లో వివరాలు నమోదు చేసి 24 గంటల్లోనే రైతు ఖాతాల్లో డబ్బులు జమయ్యేలా ఏజెన్సీ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అవసరమయ్యే అన్ని వసతులు కల్పించనున్నారు. విద్యుద్దీపాలతో పాటు తాగునీరు, టెంటు, తదితర వాటిని ఏర్పాటు చేయనున్నారు.
కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం..
ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రభుత్వం ఏ గ్రేడ్ రకానికి రూ.2,060, బీ గ్రేడ్ రకానికి రూ.2,040 ధర ప్రకటించింది. నిర్మల్ జిల్లాలో 182 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ మేరకు జిల్లాస్థాయిలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించి కొనుగోలు, రవాణా, కొనుగోలు కేంద్రాల వద్ద సౌకర్యాలు, గన్నీ సంచుల కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించుకోవాలి.
– సుధారాణి, డీఎస్వో, నిర్మల్