నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 5 : గురువుల స్ఫూర్తితోనే తాను ఈ స్థాయికి వచ్చానని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పట్టణంలోని అంబేద్కర్ భవనంలో సోమవారం నిర్వహించిన జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిర్మల్ జడ్పీ చైర్మన్ విజయలక్ష్మి, కలెక్టర్ ముఫారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేసిందన్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తున్నదని పేర్కొన్నారు.
మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం చదువులతో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఉత్తమ ఫలితాలను సాధించాయన్నారు. ఈ ఏడాది పదోతరగతి ఫలితాల్లో రాష్ట్రంలో నిర్మల్ రెండోస్థానంలో నిలిచినందుకు డీఈవో రవీందర్ రెడ్డిని, ఉపాధ్యాయులను అభినందించారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో విద్యార్థులు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉందని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో పది ఫలితాల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలబెట్టాలని ఆకాంక్షించారు. జిల్లాలో విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఉపయోగకరంగా ఉండేందుకు సైన్స్ అండ్ టెక్నాలజీ మంజూరు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని, విద్య, వైద్యం పరంగా మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇటీవల జిల్లాకు నూతన గురుకుల పాఠశాల, మెడికల్, నర్సింగ్ కళాశాలలు మంజూరయ్యాయని తెలిపారు. అలాగే మన ఊరు-మన బడిలో 260 పాఠశాలలు ఎంపికవగా, 94 పాఠశాలలకు నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. జిల్లా నుంచి ట్రిపుల్ ఐటీకి 25 మంది విద్యార్థులు ఎంపికయ్యారని గుర్తు చేశారు.
అవార్డు గ్రహీతలకు ఘన సన్మానం..
విద్యాశాఖలో ఉత్తమ సేవలు అందించిన 104 మంది.., సంక్షేమ పాఠశాలలో ఉత్తమ సేవలు అందించిన 20 మంది.. మొత్తం 124 మంది ఉపాధ్యాయులను మంత్రి, అధికారులు మెమొం టో, ప్రశంసా పత్రం అందించి ఘనంగా సత్కరించారు. స్వచ్ఛ పాఠశాలలుగా ఎంపికైన ప్రధానోపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. అంతకుముందు వివిధ పాఠశాలల విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, రాంకిషన్ రెడ్డి, డీఈవో రవీందర్ రెడ్డి, సెక్టోరియల్ అధికారి శ్రీదేవి, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ సిద్ధ పద్మ, ఆయా ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.