బోథ్, ఆగస్టు 27 : ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పొలాల అమావాస్య పండుగను శనివారం ఘనంగా నిర్వహించారు. బోథ్ మండలం ధన్నూర్ (బీ), బోథ్, అందూర్, మందబొగూడ, కుచ్చిరాలతండా గ్రామాల్లో రైతులు ఎద్దులను అలంకరించి హనుమాన్ మందిరాల వద్దకు తీసుకెళ్లి పూజలు చేశారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. అనంతరం తమ ఇళ్ల వద్దకు తీసుకెళ్లి పూజలు చేసి నైవేద్యాలు తినిపించారు.
నేరడిగొండ మండలంలో..
మండలంలోని బుగ్గారం(బీ), వడూర్, బుద్దికొండ, యాపల్‌గూడ గ్రామాల్లో రైతులు ఎద్దులను ఊరేగించారు. అనంతరం హనుమాన్ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. ఎద్దులకు నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. పంటలు బాగా ఉండాలని వేడుకుంటూ మొక్కులు చెల్లించుకున్నారు.
భీంపూర్ మండలంలో..
మండలంలోని గ్రామాల్లో మట్టి ఎడ్ల పొలాల పండుగ నిర్వహించారు. రైతులు మట్టి, కర్రతో చేసిన నాగలి, ఎద్దుల ప్రతిమలకు పూజలు చేశారు. అలాగే శ్రావణ ముగింపు సూచకంగా బడుగ పండగ నిర్వహించారు. పొలాల పండుగ రోజు ఇళ్ల వద్ద ఉంచిన మోదుగ కొమ్మలను సమీప వాగుల్లో నిమజ్జనం చేశారు. తెల్లవారగానే గ్రామాల శివసంధు (శివార్లు) వద్దకు వెళ్లి అక్కడ ప్రతిష్ఠించి ఉన్న వాగోబా( పెద్దపులి విగ్రహం)కు పూజలు చేశారు.
ఇంద్రవెల్లి మండలంలో..
మండలంలోని గిన్నేరా, తుమ్మగూడ, కేస్లాగూడ(జీ) గ్రామాల్లో ఆదివాసీ గిరిజన రైతులు ఎద్దులను చెరువులు, వాగులకు తీసుకెళ్లి స్నానాలు చేయించారు. కొమ్ములకు రంగులు వేసి అలంకరించారు. ఊరేగింపుగా ఎద్దులను తీసుకెళ్లి ఆలయాల చుట్టూ తిప్పి, ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు తినిపించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
సిరికొండ మండలంలో..
మండలంలోని రిమ్మ, సౌత్మోరి, వాయిపేట, కన్నపూర్ తండా గ్రామాల్లో పెద్దపటేళ్ల కుటుంబాలలో పూజలు చేశారు. అక్కడి నుంచి ఎద్దులను గ్రామదేవతాలు,మహాలక్ష్మీ, దగ్గులవ్వ, శివుడు, హనుమాన్ ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. అనంతరం ఇంటికి తీసుకువచ్చి ఆడపడుచుల చేతుల మీదగా మంగళహారతులు ఇప్పించి నైవేద్యం తినిపించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు అనిల్‌కుమార్, నర్మదా, గ్రామపటేళ్లు పాల్గొన్నారు.
గుడిహత్నూర్‌లో..
పండుగలు గ్రామ ఐక్యతకు దోహదపడతాయని జడ్పీటీసీ బ్రహ్మానంద్ అన్నారు. మండల కేంద్రంలో శివకల్యాణ మండపం వద్ద ఎద్దులకు నిర్వహించిన కల్యాణ మవోత్సవానికి ఆయన హాజరై మాట్లాడారు. గ్రామం, కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని, పంటలు బాగా పండాలని శ్రావణ మాసంలో ప్రత్యేక ఉపవాసాలతో ఉండడం శుభసూచికమని అన్నారు. పొలాల అమావాస్య సందర్భంగా రైతులు శివాలయం, హనుమాన్ మందిరాల చుట్టూ ఎద్దులను ఐదు సార్లు ప్రదక్షిణలు చేయించారు అనంతరం గుడి ముందు వరుసలో నిలబెట్టి మధ్యలో ఒక ఆవును ఉంచి, పెండ్లి మంత్రాలతో వాటికి పూజలు చేశారు. ఎడ్లకు నైవేద్యాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. మగవారితో పాటు మహిళలు, యువతి, యువకులు, పిల్లలు మందిరానికి చేరుకొని శివపార్వతి కల్యాణం తిలకించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు ధరమ్‌పాల్, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.