బోథ్, మే 31 : పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు గ్రూప్ డిస్కషన్ విధానంలో చదివితే సత్ఫలితాలు వస్తాయని ఆదిలాబాద్ డీఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. బోథ్ మండలంలోని సొనాల రైతు వేదిక భవనంలో తుల శ్రీనివాస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు అవసరమైన స్టడీ మెటీరియల్‌ను మంగళవారం అభ్యర్థులకు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ఆదిలాబాద్ ఆర్డీవో రాథోడ్ రమేశ్, సొసైటీ అధ్యక్షుడు, బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ హాజరయ్యారు. సొసైటీ ఆధ్వర్యంలో 11 రకాల పుస్తలను ముద్రించి అందించడం అభినందనీయమన్నారు. ఉద్యోగార్థులు ప్రతి పుస్తకాన్నీ కనీసం వందసార్లు చదవాలన్నారు. ప్రతి ప్రశ్నకు జవాబు రాసేలా తయారు కావాలని సూచించారు. ఒక్కరే కాకుండా నలుగురైదుగురు కలిసి చదువుతూ ఒకరికొకరు ప్రశ్నలు వేసుకుంటూ జవాబులు చెప్పుకోవాలని తెలిపారు. ఆర్డీవో మాట్లాడుతూ.. ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారు ఇష్టపడి చదవాలన్నారు. కచ్చితంగా ఉద్యోగం సాధిస్తానని లక్ష్యంగా పెట్టుకుంటే జాబ్ తప్పకుండా వస్తుందన్నారు.
స్టడీ మెటీరియల్ అన్ని రకాల ఉద్యోగాల కోసం ఉపయోగపడేలా తయారు చేయించారని అభినందించారు. గ్రూపు డిస్కషన్‌తో చదివితే అనుమానాలు సులభంగా పరిష్కరించుకోవచ్చన్నారు. ఎంపీపీ తుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించాలనే సంకల్పంతో నిష్ణాతులైన నిపుణులతో 11 రకాల పుస్తకాలు ముద్రించామన్నారు. వేలాది మంది అభ్యర్థులు ఆన్లైన్లో స్టడీ మెటీరియల్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోగా.. ప్రస్తుతం 250 మందికి అందిస్తున్నామన్నారు. 100 నుంచి 150 మంది అభ్యర్థులు పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలు సాధించాలని ఆకాక్షించారు. యువతకు చేయూత అందించేందుకు సొసైటీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. వైస్ ఎంపీపీ రాథోడ్ లింబాజీ, సర్పంచుల సంఘం అధ్యక్షుడు బీ శ్రీధర్‌రెడ్డి, ఎస్ఐ రవీందర్, ఎంపీటీసీలు, సర్పంచులు, సొసైటీ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, వివిధ గ్రామాల విద్యార్థులు పాల్గొన్నారు.
పేద వర్గాలను ఆదుకునేందుకే సొసైటీ..
పేద వర్గాలను ఆదుకునేందుకే తుల శ్రీనివాస్ వెల్ఫేర్ సొసైటీని ఏర్పాటు చేశాం. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంతో పాటు వారికి ఆర్థికసాయం అందిస్తున్నాం. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు పోటీలు ఏర్పాటు చేయిస్తున్నాం. అవసరమైన క్రీడా సామగ్రిని సరఫరా చేస్తున్నాం. కార్పొరేట్ దవాఖా నల్లో అత్యవసర సమయంలో వైద్య సేవలు అందేలా చూస్తున్నాం. సొనాల యువత సహకారంతోసేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
– తుల శ్రీనివాస్, ఎంపీపీ, సొసైటీ అధ్యక్షుడు
పోటీ పరీక్షలన్నింటికీ అవసరమయ్యేలా..
పోలీసు ఉద్యోగాల పరీక్షల కోసం అవసరమైన స్టడీ మెటీరియల్ తయారు చేశారు. ఈ స్టడీ మెటీరియల్ అందరికీ ఉపయోకరంగా ఉంది. ప్రస్తుతం నేను బీసీ స్టడీ సర్కిల్‌కు కోచింగ్ కోసం వెళ్తున్నా. ఆ నోట్స్‌తో పోలిస్తే ఈ స్టడీ మెటీరియల్ పుస్తకాలు బాగున్నాయి. అన్నీ సులువుగా చదువుకునేలా ఉన్నాయి. – నరోత్తంరెడ్డి, పొచ్చెర
ఇంటి వద్దే కష్టపడి చదువుతా..
తుల శ్రీనివాస్ వెల్ఫేర్ సొసైటీ వారు అందించిన స్టడీ మెటీరియల్‌తో ఇంటి వద్దే కష్టపడి చదువుతా. పదకొండు రకాల పుస్తకాలు పనికి వచ్చేలా తయారు చేయించారు. ప్రస్తుతం కాంపిటేటీవ్ పుస్తకాలు బయట నుంచి తెచ్చుకొని చదువుతున్నా. ఇప్పుడు మంచి స్టడీ మెటీరియల్ దొరికింది. వీటిని క్షుణ్ణంగా చదువుతా.
– ఆరె రాకేశ్, బోథ్
మెటీరియల్ బాగుంది..
పోలీసు ఉద్యోగాల పోటీ పరీక్షల కోసం తయారు చేయించిన స్టడీ మెటీరియల్ బాగుంది. నాలాంటి పేద విద్యార్థులు ఇంటి వద్దే ఉండి చదువుకోవచ్చు. బయట స్టడీ మెటీరియల్ కొనాలంటే వేలాది రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. తుల శ్రీనివాస్ వెల్ఫేర్ సొసైటీ వారు ఉచితంగా అందించినందుకు కృతజ్ఞతలు.
– మునేశ్వర్ జ్యోతి, సొనాల
మాలాంటి వారికి ఎంతో ఉపయోగం..
మాలాంటి పేద అభ్యర్థులకు ఈ స్టడీ మెటీరియల్ ఎంతగానో ఉపయోకరంగా ఉంటుంది. కానిస్టేబుల్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేశా. ప్రస్తుతం ఇంటి వద్దే పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్నా. 11 రకాల పుస్తకాలు నాలాంటి వాడికి బాగా ఉపయోప డతాయి. వీటిని క్షుణ్ణంగా చదివి జాబ్ కొడతా.