నిర్మల్, మే 31 (నమస్తే తెలంగాణ) : పదోతరగతి వార్షిక పరీక్షలు ఇటీవల ముగియగా, ఈ నెల 2 నుంచి 11వ తేదీ వరకు స్పాట్ వాల్యు యేషన్ ప్రక్రియకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. మొట్టమొదటి సారిగా నిర్మల్ జిల్లాకు కేంద్రాన్ని కేటాయించగా, సెయింట్ థామస్ పాఠశాలను ఎంపిక చేశారు. కాగా, కోడింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇందుకోసం జిల్లాలోని సీనియర్ ఉపాధ్యాయులనే విధుల్లో నియమిస్తూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. కాగా, అర్హుల జాబితాలో ఉన్న ఉపాధ్యాయులు ముల్యాంకనానికి హాజరుకాని పక్షంలో ప్రత్యామ్నాయ భర్తీకి వీలుగా ప్రా రంభం రోజున వారు అప్పటికప్పుడే ఆర్డర్లు ఇచ్చే లా ఏర్పాట్లు చేసినట్లు డీఈవో రవీందర్‌రెడ్డి తెలిపారు. అలాగే స్పాట్ వాల్యుయేషన్ నిర్వహించే ప్రాంగణంలో పూర్తిస్థాయిలో భద్రల ఏర్పాటు చేశారు. పరీక్షా పత్రాలను స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు. పరీక్షా పత్రాలకు మే 25వ తేదీ నుంచి డీ కోడింగ్ ప్రక్రియ ప్రారంభించారు. మూల్యాంకన ప్రక్రియలో లోటుపాట్లు లేకుండా ముందు జాగ్రత్తగా విద్యాశాఖ అధికారులు అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించి, పలు సూచనలు చేశారు. ఏసీవోలుగా ఏడుగురిని నియమించారు. అలాగే చీఫ్ కోడింగ్ ఆఫీసర్లుగా ఇద్దరిని, అసిస్టెంట్ కోడింగ్ ఆఫీసర్లుగా 10 మందిని కేటాయించారు. సమాధాన పత్రాల ముల్యాంకనం.., పర్యవేక్షణ.., తదితర విషయాలపై ఇప్పటికే ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు.
జిల్లాలో తొలిసారి..
నిర్మల్ ఏర్పడిన నాటి నుంచి జిల్లా కేంద్రంలోనే 10వ తరగతి మూల్యాంకనం సెంటర్ ఏ ర్పాటు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరు తూ వచ్చాయి. ఈ నేపథ్యంలో మొదటిసారి జిల్లా కు రెగ్యులర్ స్పాట్ సెంటర్ కేటాయించారు. ఈ ఏడాది జిల్లాకు 95వేల సమాధాన పత్రాలను కేటాయించారు. స్పాట్ వాల్యుయేషన్‌లో పాల్గొనే ఉపాధ్యాయులకు రోజుకు గరిష్ఠంగా 40 పేపర్లు మాత్రమే మూల్యాంకనానికి ఇవ్వనున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా సమాధాన పత్రాల ను తగ్గించి ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది. మూ ల్యాంకనంలో తప్పులు జరిగితే చర్యలు తీసుకోవడంతో పాటు షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నట్లు సంబంధిత ఉన్నతాధికారులు హెచ్చరించారు.
690 మందికి విధులు..
మూల్యాంకనం చేసేందుకు సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులను నియమించారు. తెలుగు సబ్జెక్టుకు స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు 178 మంది కాగా, హిందీకి 89, ఇంగ్లిష్‌కు 61, గణితం సబ్జెకుకు 117, భౌతిక శాస్ర్తానికి 57, జీవశాస్ర్తానికి 46, సాంఘిక శాస్ర్తానికి 121 మందిని కేటాయించారు. అలాగే స్పాట్లో స్పెషల్ అసిస్టెంట్లు 148 మందితో కలిపి మొత్తం 690 మంది పాల్గొననున్నారు. వీరిలో చీఫ్ ఎగ్జామినర్లు (సీఈ), అసిస్టెంట్ ఎగ్జామినర్లు (ఏఈ) ఉన్నారు. వీరితో పాటు స్ట్రాంగ్ రూం స్టాఫ్, కోడింగ్, ప్యాకింగ్, ఈసీవోలు, డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్లు ఇలా మరో 10 మంది పాల్గొంటున్నారు.