కుభీర్, నవంబర్ 01: నిర్మల్ జిల్లా కుభీర్ (Kubeer)లో సోయా టోకెన్ల (Soyabeans) కోసం రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో క్యూలైన్లో చెప్పులు పెట్టి తమ వంతు కోసం వేచిచూస్తున్నారు. కుభీర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో (PACS) సోయా టోకెన్లు (Soya Tokens) ఇస్తున్నారని తెలుసుకున్న రైతులు.. అర్ధరాత్రి నుంచి చెప్పులను క్యూ లైన్లో పెట్టి బారులు తీరారు. సోయా పంట చేతికి వచ్చి నెల రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ సోయా కొనుగోలు కేంద్రాలను ఇప్పటికీ తెరలేదు. దీంతో సుమారు 30 శాతం రైతులు సోయాలను దళారులకు అమ్ముకొని తీవ్రంగా నష్టపోయారు.
ప్రభుత్వం సోయా కొనుగోళ్లను చేపడుతుందని, రైతులు దళారులకు అమ్ముకొని నష్టపోవద్దని ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ 15 రోజులుగా విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. దీంతో మండల రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణంలో శుక్రవారం రాత్రి పీఏసీఎస్ అధికారికంగా సోయ కొనుగోలుకు సంబంధించి టోకెన్లను జారీ చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో రైతులు పనులన్నీ పక్కనపెట్టి టోకెన్ల కోసం బారులు తీరడం గతంలో ఎన్నడూ చూడని పరిస్థితి. భారీ సంఖ్యలో పురుషులకు సమానంగా మహిళ రైతులు కూడా టోకెన్ల కోసం క్యూ లైన్లో నిల్చోవడం చూస్తుంటే రైతులపై ప్రభుత్వం చూపిస్తున్న ప్రేమ ఎలాంటిదో రైతులకు అర్థం అయిపోతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నడూ లేని ఇలాంటి పరిస్థితులు లేవని, రెండు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన రైతులను సంక్షోభంలోకి నెట్టినట్టయింది. పలువురు రైతులు బాహాటంగానే పదేళ్ల కేసీఆర్ పొలంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ చూడలేదని కాంగ్రెస్ పాలన రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు.
