సోన్, ఫిబ్రవరి 3 : నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని పాక్పట్ల గ్రామానికి చెందిన రైతు బోర నర్సయ్య(45) మొక్కజొన్న పంట రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఎర్తింగ్ వైర్ తగిలి మృతి(Farmer dies) చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. పాక్పట్ల గ్రామంలో నర్సయ్య రెండెకరాల భూమిని కౌలుకు తీసుకుని మొక్కొజొన్న సాగు చేస్తున్నాడు. ఈ వ్యవసాయ భూమి గోదావరి ఒడ్డున ఉండడంతో అడవి పందులు వచ్చి పంటను నాశనం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం పంటల రక్షణ కోసం ఎర్తింగ్ వైరు బల్బులను అమర్చాడు.
సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో వైర్స్ను తీసేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్(Electric shock) తగిలి పడిపోయాడు. నర్సయ్య కుమారుడు భరత్ గమనించి చుట్టు పక్కల రైతుల సహాయంతో నిర్మల్లోని ఏరియా హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎఐ షేక్ హైమద్ తెలిపారు.