కడెం : కడెం మండలం (Kadem Mandal) లక్ష్మిపూర్ గ్రామం (Laxmipur Village) లోని గుడుంబా స్థావరాలపై బుధవారం ఆబ్కారీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పోడేటి సత్య గౌడ్ దగ్గర 120 కేజీల నల్ల బెల్లం, 20 కేజీల పటిక పట్టుబడింది. అదేవిధంగా 500 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. సత్యగౌడ్పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
అనంతరం ఎస్ఐ అభిషేకర్ మాట్లాడారు. నాటుసారా తయారు చేసినా, అమ్మినా, రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ఖానాపూర్ మండలంలోని పాతయేల్లాపూర్ గ్రామనికి చెందిన మాసం రాజేశ్వర్ అనే వ్యక్తిని బైండోవర్ ఉల్లఘించినందుకు జైలుకు పంపినట్లు ఎక్సైజ్ SI అభిషేకర్ చెప్పారు. మాసం రాజేశ్వర్ అనే వ్యక్తి గతంలో నాటుసారా విక్రయస్తూ పట్టుబడగా అతనిపై కేసు నమోదు చేశారు.
అనంతరం ఖానాపూర్ మండల్ తహసీల్దార్ ముందు రూ.2 లక్షల జరిమానా లేదా 2 సంవత్సరాల జైలు శిక్షకు బైండోవర్ చేశారు. అయితే రాజేశ్వర్ బైండోవర్ ఉల్లంఘించి మళ్ళీ నాటుసారా అమ్ముతూ పట్టుబడ్డాడు. దాంతో తహసీల్దార్ సుజాత అతడిని రిమాండ్కు పంపమని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. దాంతో ఆదిలాబాద్ జైలుకు పంపినట్లు ఎస్సై అభిషేకర్ తెలిపారు. దాడుల్లో సిబ్బంది వెంకటేష్, హరీష్, సాయి, రాజేందర్, కల్పన పాల్గొన్నారు.