సారంగాపూర్ : నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని జామ్ గ్రామంలో సోమవారం రూ.10 లక్షల అంచనా వ్యయంతో మహాలక్ష్మి ఆలయం సీసీ రోడ్డు నిర్మాణ పనులను డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరి రావు భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, నిరుద్యోగులకు 55 వేల ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు.
నిరుద్యోగులు తమ కాళ్ళ మీద తాము నిలబడి ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం ప్రభుత్వం రాజీవ్ వికాస్ యోజన పథకం ద్వారా వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలను అందించి ఆదుకోవడం జరుగుతుందని డీసీసీ అధ్యక్షుడు చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే ప్రతిపక్ష పార్టీలు లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు కేటాయించడం లేదని, వారి ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని అన్నారు.
తెలంగాణలో బీజేపీ నాయకులకు దమ్ము, ధైర్యం ఉంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. పేదల గృహాలకు ఉచిత కరెంటు, వివిధ కార్యక్రమాలను కూడా ప్రభుత్వం చేపడుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, గ్రామాల్లో సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం మహాలక్ష్మి ఆలయాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాది, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లోజి నర్సయ్య, కాంగ్రెస్ నాయకులు నారాయణరెడ్డి, నవీన్ రెడ్డి, రాజు, ట్రెడ్ మహేందర్, వడ్డేపల్లి రాజు, పవన్, లింగారెడ్డి, పోతారెడ్డి, భోజన్న, దర్శనం లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.