కుభీర్, జూలై 23 : నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని కసర అంగన్వాడీ కేంద్రంలో సీలింగ్ ఫ్యాన్ ఊడిపడి జాదవ్ విరాజ్ అనే మూడు సంవత్సరాల బాలుడికి గాయాలు కాగా ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం జరుగగా బుధవారం బాధిత కుటుంబ సభ్యులు అంగన్వాడీ కేంద్రానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం సీలింగ్ ఫ్యాను ఊడిపడంటతో జాదవ్ విరాజ్ అనే మూడేళ్ల బాలుడి తలకు గాయమైంది. ఆయా లక్ష్మి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన భైంసా లోని ప్రైవేట్ దవాఖానకు తీసుకువెళ్లారు.
అక్కడ వైద్యులు పరీక్షించి తలకు కుట్లు వేసి ప్రమాదం ఏమీ లేదని చెప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, బుధవారం ఉదయం గాయపడిన బాలుడి కుటుంబ సభ్యులు అంగన్వాడీ కేంద్రానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడకు చేరుకున్న భైంసా ఐసిడిఎస్ సిడిపిఓ రాజశ్రీ, సూపర్ వైజర్ జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.