నార్నూర్, సెప్టెంబర్ 8 : వలస లంబాడీలకు ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వొద్దని ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల రాజ్ గోండు సేవా సమితి అధ్యక్షుడు ఆత్రం పరమేశ్వర్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ జాడి రాజాలింగంకు రాజ్ గోండు సేవా సమితి నాయకుల ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1950 తర్వాత వలస వచ్చిన లంబాడీలు, సుగాలిలు, బంజారాలకు ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వకూడదని ఆయన కోరారు. మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి వలస వచ్చి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఆదివాసుల వనరులను అన్యాయంగా ఆక్రమిస్తూ ఎస్టీ హక్కుల పేరుతో లాభాలు పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగాలు, విద్య, వైద్య, భూములు, నియామకాల రంగాలలో ఆదివాసులకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 342 ప్రకారం 1976లో తప్పుడు రీతిలో ఎస్టీ జాబితాలో చేర్చుకున్నట్లు ప్రచారం చేస్తూ, నకిలీ ఆధారాలతో సదుపాయాలు పొందుతున్నారన్నారు, వలస లంబాడీలకు ఎస్టీ సర్టిఫికెట్లు జారీ చేయకూడదన్నారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘం మండల అధ్యక్షుడు కుమ్రం చతుర్ షావ్, ఉపాధ్యక్షులు కోట్నాక్ శ్రీరామ్, ప్రధాన కార్యదర్శి పెందోర్ జగన్నాథ్ రావు, కార్యవర్గ సభ్యులు మెస్రం శంకర్, నాయకులు దేవిదాస్, నవీన్ కుమార్, భీం రావ్, గోవింద్, పరుశురాం, భీం రావ్ తదితరులున్నారు.