కుభీర్, మార్చి 25 : నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో ఆయా గ్రామాల ఆశా కార్యకర్తలు మంగళవారం ఆందోళనకు దిగారు. మండలంలోని 43 గ్రామ పంచాయతీలకు చెందిన ఆశా కార్యకర్తలు కుభీర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ప్రభుత్వ మొండి వైఖరిని నిరసించారు. అక్కడి నుండి ర్యాలీగా బజార్ గల్లీ, ఎస్సీ కాలనీలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. చాలీచాలని వేతనంతో కొన్నేళ్లుగా తాము ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని దుమ్మెత్తి పోశారు.
24 గంటలు పని చేయించుకుంటూ కనీస వేతనం ఇచ్చేందుకు ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు ప్రభుత్వంపై పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆశా కార్యకర్తల ఆవేదనను ఆలకించి డిమాండ్లను నెరవేర్చాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తల అధ్యక్షురాలు సులోచన, లక్ష్మి, షాహానే గంగామణి, మాహోర్ పద్మ, గోనె గిరిజ పాల్గొన్నారు.