నిర్మల్ టౌన్, ఏప్రిల్ 18: దళిత బంధు పథకానికి నిధుల కొరత లేదని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేశారు. నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో దళితబంధు పథకంపై ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో సమీక్షా సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఏ సంక్షేమ పథకం ప్రవేశపెట్టినా అది దేశంలో చర్చకు దారితీస్తున్నదన్నారు. దళితబంధు పథకానికి బడ్జెట్లో రూ. 18,800కోట్లను కేటాయించామని మంత్రులు వివరించారు. మొదటి విడుత కింద రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో వంద మంది చొప్పున దళిత కుటుంబాలకు రూ. 10లక్షల విలువైన యూనిట్లను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.
రెండో విడుత కింద 1500 మందిని ఎంపిక చేస్తామన్నారు. వచ్చే ఐదేళ్లలో ప్రతి దళిత కుటుంబానికి ఈ దళితబంధు పథకం అమలు చేసి తీరుతామని మంత్రులు స్పష్టం చేశారు. దళితబంధు పథకంపై ప్రతిపక్ష పార్టీలు బురద చల్లే ప్రయత్నం చేశాయని, అయినా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా క్షేత్రస్థాయిలో దాన్ని అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. యూనిట్ల మంజూరులో అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. దళితబంధు పథకంలో చాలా మంది వాహన రంగాన్ని ఎంచుకుంటున్నారని ప్రత్యామ్నాయంగా వ్యవసాయం, పరిశ్రమల రంగాలను కూడా ఎంచుకునేలా చైతన్యం తేవాలని సూచించారు. ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి మాట్లాడుతూ రైతు బంధు పథకం దేశానికే ఆదర్శమన్నారు.
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ యూనిట్లు పొందిన లబ్ధిదారులకు తగిన నైపుణ్య శిక్షణ ఇవ్వాలని కోరారు. మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు మాట్లాడుతూ లబ్ధిదారులు పొందిన వాహనాలు రెండు, మూడేళ్లలో విక్రయించే అవకాశం ఉంటుందని, అలా కాకుండా వారి కుటుంబాలు బాగు పడేలా అర్హత ఉన్న వారిని ఎంపిక చేయాలన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ మాట్లాడుతూ యూనిట్లు కొనసాగించేలా అధికారులు నిత్యం పర్యవేక్షించాలని సూచించారు. కుటుంబాలు శాశ్వత ఉపాధి పొందేల చూడాలన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ వ్యవసాయ ఆధారిత యూనిట్లను ఎంపిక చేసుకునేలా అధికారులు లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని కోరారు. ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేసినట్లు తెలిపారు.
ఇప్పటికే 129 మందికి యూనిట్లను అందజేశామని చెప్పారు. మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి మాట్లాడుతూ 50 శాతం మంది వాహన రంగంవైపు మొగ్గు చూపారని పేర్కొన్నారు. దీంతో పాటు గొర్రెలు, మేకలు, సూపర్ మార్కెట్లు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించినట్లు చెప్పారు, ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, జడ్పీ చైర్మన్ విజయలక్ష్మి, అదనపు కలెక్టర్లు రిజ్వానంద్, హేమంత్ బోర్కడే, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.