నార్నూర్, నవంబర్ 28 : గత పాలకుల నిర్లక్ష్యంతో శిథిలమైన ప్రధాన రహదారి కష్టాలు తొలగిపోనున్నాయి. రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. దీంతో మారుమూల గ్రామాలకు సైతం అద్దాల్లాంటి బీటీ రోడ్లు నిర్మాణమవుతున్నాయి. నార్నూర్ మండలం నుంచి మలంగి గ్రామానికి వెళ్లే ఆర్అండ్బీ ప్రధాన రహదారికి ప్రభుత్వం ఇటీవల నిధులు మంజూరు చేసింది. దీంతో మండల కేంద్రం నుంచి మాల్కుగూడ వరకు బీటీ వేశారు. కాగా మాల్కుగూడ నుంచి మలంగి వరకు ఫారెస్టు అధికారులు బీటీ రోడ్డు నిర్మాణం నిలిపివేడయంతో మధ్యలోనే ఆగిపోయింది. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ ప్రత్యేక చొరవతో సమస్య తీరింది. దీంతో ఐదు రోజుల క్రితం బీటీ రోడ్డు నిర్మాణ పనులను జడ్పీ చైర్మన్ ప్రారంభించారు. ప్రభుత్వం రూ.1.25 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో ఏడు కిలో మీటర్ల మేర రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. మాల్కుగూడ నుంచి తారురోడ్డు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆర్అండ్బీ శాఖ ఇంజినీరింగ్ అధికారులు నిత్యం పర్యవేక్షిస్తూ త్వరతగతిన పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. తారురోడ్డు పనులు కొనసాగుతుండడంతో ప్రయాణ కష్టాలు తొలగిపోతాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నో ఏళ్ల కల ఫలించింది
వర్షాకాలంలో ప్రధాన రహదారి నుంచి మా గ్రామాలకు వెళ్లాలంటే చాలా కష్టంగా ఉండేది. అడుగడుగునా గుంతలు, ఆపై వర్షపు నీరు నిలిచేది. వాహనాలు ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంటుంది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఊరి రోడ్డుకు మహర్దశ పట్టనున్నది. రోడ్డు పనులు చేపట్టడం చాలా ఆనందంగా ఉంది. ఎన్నో ఏళ్లుగా ప్రజలు కంటున్న కల తీరనున్నది. రోడ్డు నిర్మాణానికి ప్రత్యేక చొరవ తీసుకున్న ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్కు రుణపడి ఉంటాం.
– మెస్రం హన్మంత్రావ్,టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు