భైంసాను ముంచెత్తిన వాన
రికార్డుస్థాయిలో 12 సెంటీమీటర్లు
రాత్రి తాడుసాయంతో వాగు దాటిన గిరిజనులు
ఇంద్రవెల్లి/బోథ్/భైంసా/భీంపూర్, ఆగస్టు 30 :ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు ఎడతెరిపిలేని వాన పడింది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని మామిడిగూడ(జి), జైత్రంతండా, జెండాగూడ, సట్వాజిగూడ గ్రామాలకు చెందిన వాగులు ఉప్పొంగాయి. దీంతో మామిడిగూడ(జి) గ్రామానికి చెందిన ఆదివాసులు సోమవారం కావడంతో నిత్యావసర సరుకులతోపాటు కూరగాయలు కొనుగోలు చేయడానికి మండల కేంద్రానికి వెళ్లారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురవడంతో మామిడిగూడ(జి) వాగు ఉప్పొంగింది. ఆదివాసులు వాగును తాడు సాయంతో రాత్రి దాటారు. బోథ్, ధన్నూర్ (బీ), కౌఠ (బీ), సొనాల ప్రాంతాల్లో కురిసిన వర్షంతో పంట పొలాల్లో నీరు నిలిచింది. పొలం పనులకు వెళ్లిన రైతులు చిక్కుకోగా.. స్థానికులు కాపాడారు. భీంపూర్ మండలం ఎస్ఐ రవీందర్ సిబ్బందితో భీంపూర్, సెంటర్సాంగ్వి గ్రామాల పరీవాహక ప్రాంతాల్లో పెన్‌గంగా ప్రవహిస్తుండడంతో అప్రమత్తంగా ఉండాలని దండోరా వేయించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని దిందా, కేతిని వాగు పొంగి పొర్లడంతో దిందా గ్రామానికి రాకపోకలు నిలిచాయి. బాలాజీఅన్‌కోడ, రవీంద్రనగర్ మధ్యలోని తీగల ఒర్రెతో పాటు రవీంద్రనగర్ నుంచి గంగాపూర్ వెళ్లే మధ్యంలో ఒర్రె పొంగి పొర్లడంతో రాకపోకలు అంతరాయం కలిగింది. బెజ్జూర్ మండలంలోని కుశ్నపల్లి వాగు వద్ద వంతెన నిర్మాణం కొనసాగుతున్న నేపథ్యంలో సామగ్రి వరదలో కొట్టుకుపోయింది.
భైంసాలో 12 సెంటీ మీటర్ల వర్షపాతం
నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించింది. దాదాపు 12 సెంటిమీటర్ల వర్షం కురిసింది. పట్టణంలోని ప్రధాన రహదారులైన మార్కెట్, మిర్చి కంపౌండ్, గాంధీ గంజ్, రాహుల్‌నగర్ ప్రాంతాల్లోని రహదారులు జలమయం అయ్యాయి. దీంతో పాదచారులు, దుకాణాదారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రధాన రోడ్లపైకి నీరు రావడంతో రహదారులన్నీ చెరువులను తలపించాయి.