మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్ మున్సిపాలిటీలో వాహనాలు ప్రాంభం
నిర్మల్ అర్బన్, ఆగస్టు 16 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న దళిత బంధు పథకం దేశానికే ఆదర్శమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం హుజూరాబాద్‌లో దళితబంధు పథకాన్ని ప్రారంభించగా నిర్మల్ నుంచి టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. క్యాంపు కార్యాలయంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం
నిర్మల్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో రూ.34 లక్షలతో జేసీబీని, రూ.13 లక్షలతో కొనుగోలు చేసిన బ్లేడ్ ట్రాక్టర్‌ను మంత్రి సోమవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఈవాహనాలు ఎంతగానో తోడ్పడుతాయన్నారు. జిల్లా కేంద్రంగా ఏర్పాటైనప్పటి నుంచి నిర్మల్ వేగంగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. నూతన జిల్లాల ఏర్పాటుతోనే పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందాయన్నారు. మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే పట్టణంలో నలువైపులా స్వాగత తోరణాలు, ఫౌంటేన్లు ఏర్పాటు చేశామని, జాతీయ రహదారిపై సెంట్రల్‌లైటింగ్, స్ట్రిప్ లైటింగ్ విధానం, గ్రీన్ బెల్ట్ ఏర్పాటుతో పట్టణానికి కొత్త కళ వచ్చిందన్నారు. రూ.5.50 కోట్లతో పట్టణంలో సుందరీకరణ పనుల కొనసాగుతున్నాయని చెప్పారు. పురాతన కోటల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక ప్రాంతం గా జిల్లాను మరింత అభివృద్ది చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, వైస్ చైర్మన్ సాజిద్, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, ఏఈ వినయ్ కుమార్, కౌన్సిలర్లు సంపంగి రవి, గండ్రత్ రమణ, అయ్యన్నగారి రాజేంధర్, బిట్లింగ్ నవీన్, శానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్, టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు పాకాల రాంచందర్, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, ఎఫ్ఏస్సీఎస్ అధ్యక్షుడు ధర్మాజీ రాజేందర్, మాజీ మండల అధ్యక్షుడు ముత్యం రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, కౌన్సిలర్లు నేరేళ్ల వేణు, సంపంగి రవి, నాయకులు ముడుసు సత్యనారాయణ, మేడారం ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.