ఆదిలాబాద్‌లో ముస్తాబైన పోలీస్ పరేడ్ మైదానం
నిర్మల్ అర్బన్, ఆగస్టు 14 : స్వాతంత్య్ర వేడుకలకు జిల్లాలు ముస్తాబయ్యాయి. నిర్మల్ జిల్లాలోని ఎన్టీఆర్ స్టేడియంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, మంచిర్యాల బాలుర హైస్కూల్ వెనుకాల ఉన్న పరేడ్ మైదానంలో విప్ బాల్క సుమన్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో విప్ అరెకపూడి గాంధీ, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో విప్ గంప గోవర్ధన్‌లు ఆదివారం జెండావిష్కరణ చేయనున్నారు.
స్వాతంత్య్ర వేడుకలకు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియం ముస్తాబైంది.ఆదివారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ఇందుకోసం మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేశారు. వేడుకలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో పట్టణ ప్రజలు హాజరుకానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బారీ కేడ్లు ఏర్పాట్లు చేశారు. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు చర్యలు చేపట్టారు. పరేడ్‌కు కొన్ని రోజులుగా పోలీసులు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు.
కొవిడ్ నిబంధనలు పాటించాలి
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వాతంత్య్ర వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో వేడుకల నిర్వహణ పనులను ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్రతో కలిసి పరిశీలించారు. జెండావిష్కరణకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ హాజరు కానున్నారని తెలిపారు. జాతీ య పతాకావిష్కరణ, జాతీయ గీతాలాపన, గౌరవ వందనం అనంతరం జిల్లాలో ప్రభుత్వ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్య అతిథి సందేశం ఉంటుందన్నారు. సుమారు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలపై శకటాల ప్రదర్శన, 13 స్టాళ్ల ప్రదర్శన ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్, అదనపు ఎస్పీ వినోద్ కుమార్, ఆర్డీవో జాడి రాజేశ్వర్, డీఆర్డీవో కిషన్, వివిధ శాఖ అధికారులు ఉన్నారు. ఉదయం 10.30 గంటల పతాకావిష్కరణ, 10.35 పోలీసు గౌరవ వందనం స్వీకరణ, 10.45 ప్రసంగం, 11.05 గంటలకు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, 11.30 గంటలకు ఉద్యోగులు , ఇతరులకు ప్రశంసా పత్రాల పంపిణీ ఉంటుందని వివరించారు. 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఏఆర్ అదనపు ఎస్పీ వినోద్ కుమార్, రిజర్వ్ సీఐ సుధాకర్‌రావు పర్యవేక్షణలో 50 మంది పోలీసులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అతిథుల కోసం ప్రత్యేకంగా వేదికను పూలమాలలతో అలంకరిస్తున్నారు. సందర్శకుల కోసం షామియానాలు ఏర్పాటు చేశారు. ఏఎస్పీలు శ్రీనివాసరావు, వినోద్‌కుమార్, సమయ్‌జాన్‌రావు, సీఐలు పోతారంశ్రీనివాస్, సుధాకర్‌రావు, గడికొప్పుల వేణు, శ్రీపాల్ , పోలీస్ అసొసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెంచల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
పరేడ్ గ్రౌండ్ సిద్ధం
ఆసిఫాబాద్,ఆగస్టు 14 : స్వాతంత్య్ర వేడుకలకు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ ముస్తాబైంది. ఏర్పాట్లను ఆర్ఐ శేఖర్‌బాబు శనివారం పర్యవేక్షించారు. ఆదివారం ఉదయం 10.30 ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ జాతీయ జెండా ఎగురవేయనున్నారు. అనంతరం 10.35 గంటలకు పోలీసుల గౌరవ వందనం స్వీకరణ, 10.40 గంటలకు జిల్లా ప్రగతిపై ప్రసంగం, 11 గంటలకు ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాల అందజేత, 11.30 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఉంటుంది. అంతకుముందు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించనున్నారు. వేడుకలకు జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప,ఆత్రం సక్కు, అదనపు కలెక్టర్లు వరుణ్ రెడ్డి, రాజేశం,ఇతర శాఖ అధికారులు, జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, ప్రజలు హాజరు కానున్నారు.
జెండా పండుగకు ఏర్పాట్లు పూర్తి
మంచిర్యాల అర్బన్/హాజీపూర్, ఆగస్టు 14 : మంచిర్యాలలోని బాలుర హై స్కూల్ లోని పరేడ్ గ్రౌండ్లో పంద్రాగస్టు వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 10.30 గంటలకు ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ జెండా ఎగురవేయనున్నారు. పరేడ్ గ్రౌండ్లో ప్రభుత్వ స్టాళ్ల ఏర్పాటును ఆయా శాఖల అధికారులు పూర్తి చేశారు.
స్వాతంత్య్ర వేడుకలకు ఆహ్వానం
మంచిర్యాల జడ్పీ బాలుర పాఠశాల మైదానంలో నిర్వహింనున్న స్వాతంత్య్ర వేడుకలకు జిల్లా ప్రజలు హాజరు కావాలని కలెక్టర్ భారతి హోళీకేరి శనివారం ఒక ప్రకటనలో కోరారు. ఉదయం 10.30 గంటలకు 10.35 వరకు జాతీయ పతాకావిష్కరణ, 10.35 నుంచి 10.45 వరకు గౌరవ వందనం, 10.45 నుంచి 11.00 గంటల వరకు విప్ బాల్క సుమన్ సందేశం, 11.00 నుంచి 11.20 వరకు శకటాల ప్రదర్శన, 11.20 నుంచి 11.45 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, 11.45 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్టాళ్ల సందర్శన, ఆస్తుల పంపిణీ, 12.05 గంటలకు వందన సమర్పణ కార్యక్రమం ఉంటుందని వివరించారు.